ఐఏఎస్‌లపై కేసుల కత్తి

by srinivas |
ఐఏఎస్‌లపై కేసుల కత్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రీవెంజ్ రాజకీయాలు నడుస్తున్నాయని తెలుగు తమ్ముళ్లు పదేపదే ఆరోపిస్తున్నారు.అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక సంక్షేమంతో పాటు, గత ప్రభుత్వం చేసిన అక్రమాలను వెలికి తీసేందుకు కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత టీడీపీ ప్రభుత్వంలో పలు విభాగాల్లో పని చేసిన ఐఏఎస్‌ల మెడపై కేసుల కత్తి వెళ్లాడుతోంది.ఇప్పటికే పలువురిని అధికారులు విచారిస్తుండగా..రానున్న రోజుల్లో మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు పలు కథనాలు వినిపిస్తున్నాయి.

సంక్షమ పథకాలపై సీబీఐ దర్యాప్తు!

గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికి తీయడంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాజధాని భూముల అంశంపై ఇప్పటికే సీఐడీ విచారణ జరుగుతుండగా.. లోతైన దర్యాప్తు కోసం సిట్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంతో పాటే ఈఎస్ఐ స్కామ్‌పై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. గత టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అయిన చంద్రన్న కానుకలు..ఫైబర్‌ నెట్‌ వంటి వాటిలోనూ పూర్తి స్థాయి విచారణను సీబీఐ ద్వారా జరిపించాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది.

ఆనాటి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ అరెస్ట్‌!

నాటి ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వారిపై ఇప్పటికే కేసులు పెట్టి అరెస్టు కూడా చేశారు.అయితే, రాజధాని భూముల విషయంలో మాత్రం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మాధురి కటకటలా పాలయ్యారు. దీంతో ప్రభుత్వం ఆమెను సస్పెండ్‌ చేసింది. ఈఎస్ఐ స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడితో పాటు అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్లు అరెస్టయ్యారు.వీరి తదనంతరం రాజధాని భూములు, ఈఎస్ఐ కుంభకోణాల్లో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయోననే సర్వత్రా చర్చ నడుస్తోంది.

భూ సేకరణలో గోల్‌మాల్..ఆ అధికారి ఎవరు?

రాజధాని భూముల విషయంలో పెద్ద స్కాం జరిగిందని ముందు నుంచే నాటి ప్రతిపక్ష.. నేటి అధికార వైసీపీ పార్టీ గట్టిగా వాదిస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పలువురు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లను సిట్‌ బృందం విచారించింది. నాడు భూ సమీకరణలో కీలకంగా ఉన్న పలువురు తహసీల్దార్ల పేర్లతో పాటు గత టీడీపీ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉండి..ల్యాండ్‌ పూలింగ్‌లో కీలకంగా వ్యవహరించిన ఓ ఐఏఎస్ పేరు సైతం సిట్‌ దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సదరు ఐఏఎస్ అధికారికి సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో సిట్‌ బృందం నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

నిత్యావసరాల కొనుగోళ్లలో చేతివాటం?

టీడీపీ హయాంలో సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ఎండీగా, ఆ శాఖ కమిషనర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా విచారణను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్‌ కానుక, రంజాన్‌ తోఫా మొదలకు కార్యాక్రమాల్లో భారీగా అక్రమాలు జరిగాయని వైసీపీ ప్రభుత్వ ఆరోపణ. కందిపప్పు సహా నిత్యావసరాల కొనుగోళ్లల్లో భారీ స్కామ్‌ జరిగిందని కేబినెట్‌ సబ్‌ కమిటీ నిగ్గు తేల్చింది. దాదాపు రూ.150 కోట్ల మేరా అక్రమాలు జరిగాయన్నది ఉపసంఘం ప్రాథమిక అంచనా.

ప్రభుత్వం వద్ద ఐఏఎస్‌ల సమాచారం?

చంద్రబాబు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేసిన ఐఏఎస్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. మరోవైపు ఏసీబీ ద్వారా వివిధ ఐఏఎస్ అధికారులకు చెందిన ఆస్తులు, ఆదాయాలపై జాబితాను రెడీ చేస్తోంది. ఓ ఐఏఎస్ అధికారికి రూ.వేల కోట్ల ఆస్తులున్నట్లు ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్‌ గోపన్నపల్లెలో ఆరెకరాలు, శంకర్‌పల్లిలో 2 ఫామ్‌ హౌస్‌లు, బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో ఓ బంగ్లా, అలాగే వెంగళరావు పార్క్‌ సమీపంలోని ఒకే కాంప్లెక్స్‌లో 22 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించినట్టు తెలుస్తోంది.

బినామీ పేర్లతో స్టీల్ సిటీలో రియల్‌ ఎస్టేట్‌ ?

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చి..వైజాగ్‌ పై ఓ క్లారిటీ ఇవ్వగానే బినామీ పేర్లతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసిన ఓ ఉన్నతాధికారికి సంబంధించిన లెక్కలన్నీ పక్కాగా ప్రభుత్వం సేకరించిందని సమాచారం.ఆ అధికారిపై సీబీఐ విచారణ మొదలైతే ఈ సమాచారాన్ని ప్రభుత్వం దర్యాప్తు అధికారులకు అందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ ఉన్నతాధికారుల్లో వణుకు మొదలైంది.ఈ వ్యవహారం నాటి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసేవారికే పరిమితమవుతుందా? లేక అధికారుల మెడకు చుట్టుకుంటుందా అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed