అత్యవసర ప్రయాణాలకు ఏపీ సరికొత్త నిర్ణయం

by srinivas |

విజయవాడ: లాక్‌డౌన్‌ను ఏపీ ప్రజలంతా పక్కాగా పాటిస్తున్నారని రాష్ట్ర పోలీసు శాఖ తెలిపింది. అయితే, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అత్యవసర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని గుర్తు చేసింది. ప్రధానంగా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే కొంతమంది ఇబ్బందులు పడుతున్నారనీ, అలాంటివారికోసం కొవిడ్‌-19 అత్యవసర రవాణా పాసులు అందిస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పాసుల జారీకి అన్ని చర్యలూ తీసుకున్నామని పేర్కొంది. అత్యవసర కారణాలను చూపి ప్రజలు ఈ పాసులు పొందొచ్చని వెల్లడించింది. పాసుల కోసం వ్యక్తిగత వివరాలతో పాటు ప్రయాణ వివరాలను తమతమ జిల్లాల ఎస్పీల వాట్సాప్‌ నెంబర్‌ లేదా మెయిల్‌ ఐడీకి పంపించాలని తెలిపారు. అన్ని పత్రాలు పరిశీలించి, వీలైనంత త్వరగా సంబంధిత పోలీసు అధికారులు పాసులు జారీచేస్తారని పేర్కొన్నారు. అయితే, తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రయాణ అనుమతి పత్రాలు ఇచ్చిన మొబైల్‌ నెంబర్‌ లేదా మెయిల్‌ ఐడీకి పంపుతారని వివరించారు. ప్రయాణ సమయంలో తప్పనిసరిగా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని తెలిపారు.

Tags: ap government, covid emergency travel pass, ap dgp office, cm jagan, corona, virus, covid 19

Advertisement

Next Story

Most Viewed