- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్: మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్
దిశ, వెబ్ డెస్క్: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళా మంత్రుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం మహిళా హెల్ప్ డెస్క్ లను ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్కలు పనిచేయనున్నాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో వేధింపుల నిరోధానికి విచారణకు కమిటీ తప్పని సరిగా ఉండాలని ఆదేశించారు.
సచివాలయంలోనే మహిళల వేధింపుల నివారణ కమిటీ లేదు.. తొలుత సచివాలయం నుంచే ఈ కమిటీ వేస్తామన్నారు. ప్రతి ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయంలో మహిళా కమిటీ తప్పక ఉండేలా చర్యలు తీసుకుంటామని జగన్ స్పష్టం చేశారు. మహిళలను ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా సాధికారత కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రేపటి తరం చిన్నారులకు సింహ భాగం పథకాలు ఇచ్చామన్నారు.
మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు:
గత 21 నెలల్లో రాష్ట్ర మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, కాపు నేస్తం మహిళల పేరిట ఇళ్ల స్థలం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు వంటి పథకాలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ”ప్రతి రంగంలోనూ మహిళలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని జగన్ చెప్పుకొచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో 60 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. ఇప్పటికీ 40 శాతం మంది మహిళలకు చదువు అందడం లేదు. చదువులకు పేదరికం అడ్డుకాకూడదనే అమ్మఒడి పథకం తీసుకొచ్చాం. రెండేళ్లలో రూ.13,220 కోట్లు అమ్మఒడి పథకం కింద ఇచ్చాం.
ఐదేళ్లలో రూ.32,500 కోట్లను అమ్మఒడి కింద ఇస్తాం. వైఎస్సార్ చేయూత కింద రూ.4,604 కోట్లు ఇచ్చాం. ఇళ్ల స్థలాల ద్వారా మహిళలకు రూ.27వేల కోట్లు ఇచ్చాం. అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత ద్వారానే 21 నెలల్లో రూ.80వేల కోట్లు అందించాం. మహిళా ఉద్యోగుల క్యాజువల్ లీవ్స్ 20 రోజులకు పెంచాం. 13 జిల్లాల్లో దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశాం. మహిళలపై నేరాలకు సత్వర విచారణ చేస్తున్నామని’’ సీఎం జగన్ అన్నారు. గతంలో మహిళలను ఉద్దేశించి చంద్రబాబు దారుణంగా మాట్లాడారని.. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని హేళన చేశారన్నారు. మన తల్లులు మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు కాబట్టే.. ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నామని సీఎం జగన్ అన్నారు.
ఈ ఏడాది మహిళలకు ప్రత్యేక బడ్జెట్:
తొలిసారిగా ఈ ఏడాది బడ్జెట్ లో జెండర్ బడ్జెట్ కాన్సెప్ట్ తీసుకువస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అక్కచెల్లెమ్మలకు తోడుగా ప్రభుత్వం ఉందని చెబుతూ జెండర్ బడ్జెట్ తీసుకువస్తున్నామని వెల్లడించారు. ఆడపడుచులకు బడ్జెట్ లో ఎంత ఖర్చు చేస్తున్నామనే వివరాలను వచ్చే బడ్జెట్ లో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. మహిళల కోసం ప్రభుత్వం ఏ పథకాల ద్వారా ఎంత మొత్తం ఖర్చుచేస్తున్నామనే వివరాలతో సహా బడ్జెట్ లో పొందుపరచబోతున్నట్లు జగన్ తెలిపారు.
మహిళలు.. ఆకాశంలో సగం:
మహిళ అంటే ఆకాశంలో సగ భాగం, సృష్టిలో సగ భాగం అంటారు.. అలాంటి మహిళలు, అక్క చెల్లెమ్మలకు సగభాగం ఇస్తున్నామా అనేది మనమంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ తెలిపారు. మహిళలకు రాజకీయంగా, ఆర్ధికంగా హక్కుల్లో సగ భాగం ఇస్తున్నామా అనేది గుండెలపై చేయి వేసుకుని ఆలోచించాలన్నారు. ”ప్రతి పనిలోనూ మహిళలే కనిపిస్తుంటారు. దేశం గర్వించేలా డ్వాక్రా ఉద్యమంలో మహిళలు క్రియాశీలకంగా ఉంటారు. ఇంటిని అన్ని విధాలా బాగుపరచాలనే తాపత్రయం అక్క చెల్లెమ్మల్లో కనిపిస్తుంది. ప్రతి ఇంటిలోనూ మహిళలు మనల్ని ఉన్నతంగా ఉంచబట్టే ఈ స్థాయిలో ఉన్నాం. భూదేవంత సహనంతో ఇంటింటా మహిళా మూర్తులు అందిస్తోన్న సేవలకు ఆర్థికంగా ఎలాంటి కొలమానాలులేవని” సీఎం జగన్ అన్నారు.
రాష్ట్రంలో మహిళల్లో అక్షరాస్యత 2011 జనాభా లెక్కల వివరాల ప్రకారం కేవలం 60 శాతం మాత్రమే ఉంది.. ఇప్పటికీ 40 శాతం మహిళలు చదువులకు దూరంగా ఉన్నారని.. అన్ని అంశాల్లోనూ స్త్రీల పట్ల సమాజంలో ఉన్న వివక్ష ఇలాగే వదిలేస్తే సమాజం ఎటు పోతుందో ఆలోచన చేయాలన్నారు. అక్క చెల్లెమ్మల కోసం అనేక పథకాలు చేపట్టామని.. చదువు రాని వారు ఉండకూడదన్న ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని తెచ్చామని వెల్లడించారు సీఎం జగన్. ఆడపిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువులు గొప్పగా చదవాలని పథకాలు చేపట్టినట్టు చెప్పుకొచ్చారు.
దిశ వాహనాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్:
900 దిశ పెట్రోల్ వెహికల్స్, 18 దిశ క్రైం సీన్ మేనేజ్‌మెంట్ వెహికల్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. జీపీఎస్, దిశ యాప్ రెస్పాన్స్ సిస్టమ్‌తో అనుసంధానం చేసే సైబర్ కియోస్క్‌లను సీఎం ఆవిష్కరించారు. బాలికలకు ఉచిత నాప్‌కిన్స్ అందించే స్వేచ్ఛ కార్యక్రమాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
‘దేశానికి దిశ’ పుస్తకం ఆవిష్కరణ:
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రూపొందించిన ‘దేశానికి దిశ’ పుస్తకాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా పలువురిని ముఖ్యమంత్రి సత్కరించారు. ఏఎన్‌ఎం శాంతి, స్వీపర్ మబున్నీసా, మహిళా కానిస్టేబుల్ సరస్వతి, వాలంటీర్ కల్యాణీలను సీఎం జగన్ సత్కరించారు.