కరోనా కాటుకు కులాలు, మతాలు లేవు: జగన్

by srinivas |
కరోనా కాటుకు కులాలు, మతాలు లేవు: జగన్
X

కరోనా కాటుకు కులాలు, మతాలు లేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనాకి దేశాలు, రాష్ట్రాలు, ధనిక, పేద తేడా అస్సలు తెలీదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులుగా సమైక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ప్రధాని కూడా ఇవే సూచనలు చేశారని ఆయన గుర్తుచేశారు.

మనదేశంలోని రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సమ్మేళనాల్లో, జగ్గీ వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ సమావేశాల్లో, మాతా అమృతానందమయి సభల్లో, పాల్ దినకరన్, జాన్ వెస్లీ తదితరుల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. వీటిని ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటనల్లా చూడవద్దని ఆయన హితవు పలికారు. దురదృష్టవశాత్తు చోటుచేసుకున్న సంఘటనగా చూడాలని ఆయన సూచించారు.

ఇలాంటి దురదృష్టకర సంఘటనను ఒక మతానికో లేక ఒక కులానికో ఆపాదించి, వారు కావాలనే చేసినట్టుగా ఆరోపించే ప్రయత్నాలు మానుకోవాలని సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి పాల్పడే వారికి హితవు పలికారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా బాధితులపై ఆప్యాయత ప్రదర్శించాలని, మనవాళ్లను మనమే వేరుగా చూడరాదని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు జరిగిన ఈ సంఘటనను ఓ వర్గం మీద ముద్రవేసేందుకు వాడుకోవద్దని జగన్ సూచించారు. ఢిల్లీలో జరిగిన ఆధ్యాత్మిక సమావేశానికి విదేశీయులు వచ్చారని, ఆ సమావేశానికి ఏపీ నుంచి కూడా వెళ్లారని తెలిపారు. అయితే ఆ సమావేశానికి వచ్చిన విదేశీయులకు కరోనా వైరస్ ఉండడంతో మనవాళ్లు కూడా కరోనా బారినపడ్డారని, ఇది దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. అది ఏ మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక సమావేశం అయినా ఇలాగే జరగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

వైద్య, ఆరోగ్య శాఖ, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి స్థాయిలో వేతనాలు అందించాలని నిర్ణయించామని ఆయన ప్రకటించారు. కరోనా నివారణకు ముందుండి పనిచేస్తోన్న సిబ్బందికి పూర్తి స్థాయిలో వేతనాలు ఇవ్వడం ఉత్తమమని ఆయన చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో వారి సేవలు అభినందనీయమని ఆయన కొనియాడారు. కాగా, ప్రభుత్వ ఆదేశాలతో కరోనా వ్యాప్తి కట్టడికి పంచాయతీరాజ్‌ శాఖ గ్రామాల్లో చర్యలు చేపట్టింది. ప్రతిరోజు ఆరు వేల చోట్ల హైపోక్లోరైడ్ పిచికారీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

Tags: ysrcp, ap, ys jagan, cm jagan, corona, salaries,

Advertisement

Next Story

Most Viewed