సీఎం జగన్​ ఏరియల్​ సర్వే

by Anukaran |
సీఎం జగన్​ ఏరియల్​ సర్వే
X

దిశ, ఏపీ బ్యూరో: ఇళ్ల చుట్టూ నీళ్లు.. బురద. ఇంకా ముంపులోనే పంట పొలాలు. చాలా దయనీయమైన స్థితి. పంటలు దెబ్బతిన్న వాళ్లకు వెంటనే ఇన్​పుట్​సబ్సిడీ ఇవ్వాలి. అది రబీ పంటకు పెట్టుబడిగా ఉపయోగపడాలి. ఉచితంగా నిత్యావసరాలు అందించాలని సీఎం జగన్​ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏరియల్​ సర్వే చేశారు. సీఎంతోపాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సర్వేలో పాల్గొని ముంపు ప్రాంతాల గురించి తెలియజేశారు. ఏరియల్​ సర్వే ద్వారా నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను, దెబ్బ తిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను పరిశీలించారు. అనంతరం సీఎం జగన్​ అధికారులతో సమీక్షించారు. పంట నష్టంపై అంచనాలను వెంటనే పూర్తి చేసి వీలైనంత త్వరగా ఇన్​పుట్​సబ్సిడీ ఇవ్వాలని ఆదేశించారు. ఈపాటికే ఉభయ గోదావరి జిల్లాలతోపాటు గుంటూరు, కృష్ణా జిల్లాల ముంపు వాసులకు ఉచితంగా నిత్యావసరాలు అందించాలని కోరారు. మిగతా జిల్లాల్లో ప్రజలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని ఆదేశించారు.

అత్యంత తక్కువ ధరకు ఇసుక ఇవ్వాలి

ప్రస్తుతం ఇసుక ధర చాలా ఎక్కువగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. సాధ్యమైనంత తక్కువ ధరకు ఇసుకను అందజేయాలని సీఎం వైఎస్​జగన్​ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియా సమావేశం ద్వారా సమీక్షించారు. ఇసుక తవ్వకం, సరఫరాల్లో ఎక్కడా అవినీతికి తావులేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. నూతన ఇసుక విధానం పారదర్శకతో పాటు ధర కూడా తక్కువ ఉండాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు నాణ్యమైన ఇసుకే సరఫరా చేయాలన్నారు.

ఇసుక రీచ్‌ల సామర్థ్యం పెంచితే పెద్ద కంపెనీలు వస్తాయని సీఎం తెలిపారు. ఎవరైనా సరే చలానా కట్టి ఇసుక తీసుకెళ్లేలా విధానం ఉండాలని నిర్దేశించారు. నియోజకవర్గాలు, ప్రాంతాలవారీగా ఇసుక ధరను నిర్ధారించాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన దానికన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తే ఎస్‌ఈబీ పర్యవేక్షిస్తుందని చెప్పారు. ప్రభుత్వ నిర్మాణాలు, బలహీనవర్గాల ఇళ్లకు రాయితీపై ఇసుక సరఫరా చేయాలన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలకు ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు సబ్సిడీ ధరపై ఇసుక సరఫరా చేయవచ్చనే విషయాన్ని పరిశీలించాలని ఆదేశించారు.

తెలంగాణాకు స్పీడు బోట్లు పంపండి

భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న తెలంగాణ రాష్ర్టానికి అత్యవసరంగా స్పీడు బోట్లు పంపాలని సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్​ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కావాల్సిన మేరకు బోట్లను అందించాలని కోరారు.

Advertisement

Next Story