- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిప్పురాజేస్తున్న నీళ్లు
దిశ, న్యూస్ బ్యూరో :
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత ముదురుతున్నది. నీటి వాడకంపై లెక్కల పంచాయితీ తెగడం లేదు. రెండు రాష్ట్రాలూ జలాల వినియోగంలో పట్టు వీడడంలేదు. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డి పాడు వ్యవహారంతో కృష్ణా జలాలపై వివాదం కొనసాగుతుండగా ఏపీ ప్రభుత్వం రివర్స్ దాడికి దిగింది. గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ అక్రమమేనని, అనుమతులు లేకుండానే నిర్మిస్తోందని గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేసింది. నీళ్ల వినియోగంపై కూడా తెలంగాణపై అభియోగాలు మోపింది. '' మీరు ఒక్కటంటే… మేం రెండంటాం…'' అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదని, సామర్థ్యం పెంపును ఆపేది లేదని కృష్ణా బోర్డుకు స్పష్టం చేసంది. సంగమేశ్వరం ప్రాజెక్టును కూడా నిర్మిస్తామని తేల్చి చెప్పింది. కృష్ణా జలాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదని చెప్పింది.ఆ రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సహా పలువురు ఇంజనీర్లు కృష్ణా, గోదావరి జలాల యాజమాన్య బోర్డు సభ్యులను కలిసి జలాల విషయంపై ఏపీ వైఖరిని తెలియజేశారు.
తప్పంతా మీదే..
పోతిరెడ్డిపాడు నీటి విడుదల సామర్థ్యం పెంపును ఆపేది లేదని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వమే నదిపై అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఫిర్యాదు చేసింది. సంగమేశ్వరం దగ్గర ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి తీరుతామన్నది.ఏపీ ఇరిగేషన్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ నారాయణరెడ్డి కేఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్‌తో భేటీ అయి, కృష్ణా జలాల అంశంపై సమగ్ర నివేదికను సమర్పించారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచడంవల్ల అదనంగా 130 టీఎంసీలను నిల్వ చేసుకుంటోందని, దీంతో కృష్ణా వరద ప్రవాహం జూరాలకు ఆలస్యంగా చేరుతుందని, వరద ప్రవాహం శ్రీశైలానికి చేరక ముందే జూరాల ప్రాజెక్టు కాలువ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తోందని ఏపీ అధికారులు ఆ లేఖలో పేర్కొన్నారు.
శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా జలాశయంలో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రస్తుత పూర్తిసామర్థ్యం మేరకు 44వేల క్యూసెక్కుల చొప్పున శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్సార్బీసీ), టీజీపీ (తెలుగుగంగ ప్రాజెక్టు), గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం (జీఎన్‌ఎస్ ఎస్)కు తరలించే అవకాశాలున్నాయని లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగులు ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా కాలువలోకి ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే చేరతాయని, నీటి మట్టం 841 అడుగులకు చేరితే హెడ్ రెగ్యులరేటర్ ద్వారా చుక్క నీరు కూడా కాలువకు చేరే అవకాశాలు లేవని తెలిపారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 834 అడుగుల నుంచే ఎడమగట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేపడుతోందని ఆరోపించారు. కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల ద్వారా 800 అడుగుల నుంచి, ఎస్సెల్బీసీ ద్వారా 824 అడుగుల నుంచే తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తోందని బోర్డుకు వివరించారు.
పాలమూరు రంగారెడ్డి ద్వారా రోజుకు 1.5 టీఎంసీ చొప్పున 90 రోజుల పాటు శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలోనూ జలాలను తరలించేందుకు నిర్మిస్తున్నారని, డిండి నుంచి కూడా 800 అడుగుల్లో 60 రోజుల్లో 30 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోసుకోవచ్చన్నారు. భక్త రామదాసు లిఫ్ట్ ద్వారా 5.5 టీఎంసీలను, తుంగభద్ర నుంచి తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా 70 రోజుల్లో 5.44 టీఎంసీలను వినియోగించుకుంటోందని వివరించారు. వీటితో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ నుంచి నీటి వినియోగం సామర్ధ్యాన్ని 77 టీఎంసీల నుంచి 105.40 టీఎంసీలకు పెంచుకున్నారని, ఆయకట్టును 7.20 లక్షల నుంచి 9.93 లక్షల ఎకరాలకు పెంచుకున్నారని పేర్కొన్నారు.
సంగమేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టునూ నిర్మిస్తాం..
తెలంగాణ ప్రభుత్వం నీటిని తరలిస్తుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం రోజురోజుకూ తగ్గిపోతోందని, తెలంగాణ 800 అడుగుల నుంచి నీటిని తరలిస్తున్న నేపథ్యంలో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తాగు, సాగునీటి ఇబ్బందులను అధిగమించడానికే శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల (సంగమేశ్వరం) నుంచి పీహెచ్‌పీకి దిగువన ఎస్సార్బీసీలోకి రోజుకు మూడు టీఎంసీలను ఎత్తిపోసే సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాన్ని తాము చేపడితే తప్పేంటని లేఖలో ప్రశ్నించారు. కృష్ణా బోర్డు కేటాయింపుల మేరకే ఈ ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తామని అంతకంటే చుక్క నీటిని కూడా అదనంగా తరలించబోమని స్పష్టం చేశారు.
కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్‌ల నుంచి అనుమతి తీసుకోకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల కల్వకుర్తి సామర్థ్యం పెంపు, నెట్టెంపాడు సామర్థ్యం పెంపు, తుమ్మిళ్ల ఎత్తిపోతల, ఎస్సెల్బీసీ సామర్థ్యం పెంపు ద్వారా 178.93 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునేలా తెలంగాణ సర్కార్ కొత్తగా ప్రాజెక్టులు చేపట్టడంపై అనేకమార్లు ఫిర్యాదులు చేశామని, వాటిపై ఏం చర్యలు తీసుకున్నారని బోర్డును ప్రశ్నించారు.
గోదావరిపై అనుమతి లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారు..
మరోవైపు గోదావరి బోర్డుకు కూడా ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. గోదావరిపై 225 టీఎంసీల సామర్థ్యంతో కాళేశ్వరం, జీఎల్ఐఎస్ (ఫేజ్-3), సీతారామ, తుపాకుల గూడెం, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు, లోయర్ పెన్‌గంగ బరాజ్, రాజ్‌పేట, చనాఖ-కొరాట, పింపరాడ్-పర్సోడా, రామప్ప నుంచి పాకాల డైవర్షన్ ద్వారా మొత్తం 450.31 టీఎంసీల నీటిని వినియోగించుకుంటూ ప్రాజెక్టులు చేపట్టినట్లు ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. గోదావరి రివర్ బోర్డుకు ఎలాంటి డీపీఆర్‌లు ఇవ్వకుండా, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆరోపణలు గుప్పించింది. ఏపీ విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్నదని, గోదావరి బేసిన్‌లో కొత్త ప్రాజెక్టులు కడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కృష్ణా నదిలో అవసరాలకు తగినంత స్థాయిలో నీరు రాకపోవడంతో గోదావరి నది నుంచి నీటిని కృష్ణా బేసిన్‌లోకి పంపే ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న తరుణంలో నీటి వినియోగంపై గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం గమనార్హం.