రూ. 11 కోట్లు సేకరించిన కోహ్లీ జంట

by Anukaran |
kohli anushka
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్ సహా ఇతర సౌకర్యాలు అందించేందుకు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మ ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. రూ. 11 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంగా ‘ఇన్ దిస్ టుగెదర్’ అనే ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించి తొలి విరాళంగా విరుష్క జంట రూ. 2 కోట్లు అందించింది. తొలుత ఈ కార్యక్రమం ద్వారా రూ. 7 కోట్లను సేకరించాలని భావించారు. అయితే ఎంపీఎల్ అనే సంస్థ రూ. 5 కోట్లను విరాళంగా అందించడంతో తమ లక్ష్యాన్ని రూ. 11 కోట్లకు పెంచారు.

విరుష్క జంట, ఎంపీఎల్ కలిపి రూ. 7 కోట్లను ఇవ్వగా.. మిగిలిన నాలుగు కోట్లను విరాళాల ద్వారా సేకరించారు. తాము రూ. 11 కోట్ల లక్ష్యం నిర్దేశించుకోగా శుక్రవారానికి రూ. 11,39,11,820 జమ అయినట్లు అనుష్క శర్మ ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘కరోనా కాలంలో అందరూ చూపించిన స్పూర్తికి నిజంగా ఆశ్చర్యపోయాను. మొదట మేము అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువ మొత్తం సేకరించడం గర్వంగా ఉన్నది. దేశ ప్రజలకు సాయం చేయడంలో మీరందరి మద్దతు ఉన్నందుకు ధన్యవాదాలు. మీరే లేకుంటే ఇదంతా సాధ్యం అయ్యేది కాదు’ అని అనుష్క ట్విట్టర్‌లో వెల్లడించింది. వీరి విరాళాల సేకరణలో ప్రముఖ ఫండ్ రైజింగ్ ఎన్జీవో కెట్టో సాయపడింది.

Advertisement

Next Story