తాగిన మత్తులో తల్లి.. చిన్నారిని ఎత్తుకెళ్లిన మరో మహిళ

by Sujitha Rachapalli |   ( Updated:2021-08-06 22:19:35.0  )
తాగిన మత్తులో తల్లి.. చిన్నారిని ఎత్తుకెళ్లిన మరో మహిళ
X

దిశ, శేరిలింగంపల్లి: తన చిన్నారి కూతుళ్లను తనతో పాటు కల్లు కాంపౌండ్ కు తీసుకువెళ్లి ఫుల్లుగా మద్యం సేవించింది. ఆమె మత్తులో ఉండగా మరో మహిళ మూడేళ్ల చిన్నారిని అపహరించింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై అహ్మద్ పాషా తెలిపిన వివరాల ప్రకారం… మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన విర్ నుష్ చందానగర్ హుడా కాలనీలో భార్య రవిత, కూతుర్లు అదీనీ సెరి(6) సదీనీ సెరి(3) లతో కలిసి నివాసం ఉంటున్నారు.

ఈ నెల 5న తారానగర్ లోని కల్లు దుకాణానికి కల్లు సేవించేందుకు వెళ్లి దుకాణం ఆవరణలోనే నిద్ర పోయింది రవిత. ఆ సమయంలో ఓ మహిళ మూడేళ్ల సదీనీని ఎత్తుకుని వెళ్లిపోయింది. నిద్ర నుండి మేల్కొన్న రవితకు పాప కనిపించకపోవడంతో భర్తతో కలిసి చందానగర్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కల్లు దుకాణ ఆవరణలోని సీసీ కెమెరాల ఆధారంగా చిన్నారిని ఎత్తుకుపోయిన మహిళను పాపిరెడ్డి కాలనీకి చెందిన జంషేడ్ లక్ష్మీగా గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారిని అపహరించిన లక్ష్మీని రిమాండుకు తరలించారు.

Advertisement

Next Story