హుజురాబాద్‌లో మారుతున్న సమీకరణాలు.. ఖాతాలో మరో రికార్డు.?

by Sridhar Babu |   ( Updated:2021-10-12 00:31:14.0  )
huzurabad
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : పట్టుమని పదిహేను రోజులు కూడా కాకముందే కేసుల పరంపర కొనసాగుతోంది. ఉప ఎన్నికల్లో ప్రచారంతో దూకుడుగా వ్యవహరిస్తున్న పార్టీలపై ఎన్నికల అధికారులు మూడో కన్ను తెరిచే ఉంచారు. సెప్టెంబర్ 28న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, అక్టోబర్ 1న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి పదిహేను రోజులు కాకముందే హుజురాబాద్‌లో వివిధ పార్టీలు, ఇండిపెండెంట్లపై 40 కేసులు నమోదయ్యాయి.

అనుమతికి మించిన జనాన్ని సమీకరించడం, అనుమతి తీసుకోకుండా ప్రచారాలు నిర్వహించడం, కొవిడ్ నిబంధనలు పాటించకుండా క్యాంపేయిన్ చేయడం వంటి వాటిపై కేసులు నమోదయ్యాయి. అలాగే హుజురాబాద్‌లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు ఆందోళన చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లపై కూడా కేసులు నమోదయ్యాయి. హుజురాబాద్ బై పోల్స్ విషయంలో ఈసీఐకి పలు ఫిర్యాదులు అందడంతో స్థానిక ఎన్నికల అధికారులు కూడా ప్రత్యేక దృష్టి సారించారు.

ఎన్నికల కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్‌ను అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యారనే చెప్పాలి. కొవిడ్ నిబంధనలకు విరుద్దంగా, ఎన్నికల కమిషన్ రూల్స్‌ను అతిక్రమించిన విషయంలో కఠినంగా ఉంటామని సీపీ సత్యనారాయణ ఇప్పటికే ప్రకటించారు. ఫోటో‌గ్రాఫ్ లభించినా కేసు నమోదు చేసి తీరుతామని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆయా రాజకీయ పార్టీలు మాత్రం తమ పంథాలోనే ప్రచారం సాగిస్తున్నాయి.

రాత్రి, పగలు ప్రచారం..

ఓ వైపున ఎన్నికల అధికారులు కొరడా ఝులిపిస్తున్నా పొలిటికల్ పార్టీలు మాత్రం తమ పంథాను వీడటం లేదు. ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. కానీ నిబంధనలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిసి కూడా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కొవిడ్ రూల్స్‌ను పాటించడం లేదనే చెప్పాలి. లిమిటేషన్‌కు మించి జనాన్ని సమీకరిస్తుండటంతో పాటు మాస్కులు లేకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు.

సంక్షేమం విస్మరిస్తూ..

అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని ప్రకటనలు చేసే పొలిటికల్ పార్టీలు ఓట్లేసే వారి ఆరోగ్యాన్ని ఎందుకు విస్మరిస్తున్నారో అంతు చిక్కకుండా తయారైందనే చెప్పాలి. తమను గెలిపిస్తే మీ బాగు కోసం పాటు పడుతామంటూ హామీలిస్తున్న నేతలు కరోనా నిబంధనలు పాటించకుండా ప్రచారాలు నిర్వహిస్తుండటం దేనికి సంకేతమో వారికే తెలియాలి. ఒకరి నుండి ఒకరికి సోకే కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించాల్సిన నాయకులే జన సమీకరణ విషయంలో కాంప్రమైజ్ కాకపోతే గెలిచిన తరువాత ప్రజలకు ఎలాంటి పాలన అందిస్తారో అర్థం కావడం లేదు.

తమ గెలుపే లక్ష్యమని.. కరోనా కష్ట కాలంలో కూడా జనసమీకరణలో వెనుకంజ వేయకుండా తిరుగుతున్న వీరు.. ప్రజా సంక్షేమం కోసం ఎలా పాటుపడుతారో అర్థం కాకుండా పోయిందనే చెప్పాలి. భవిష్యత్తులో బాగు చేస్తామని చెప్తున్న నాయకులు ముందుగా ఓటర్ల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ద వహించాల్సిన ఆవశ్యకత ఉందన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. మహమ్మారి ప్రళయం సృష్టిస్తే ఓటర్లను కోల్పోయేది తామేనని, జరగాల్సిన నష్టం తమేకేనన్న విషయాన్ని విస్మరించకూడదు.

Advertisement

Next Story

Most Viewed