త్వరలో డంపింగ్ యార్డ్‌లో మరో విద్యుత్ ప్లాంట్

by Sampath |   ( Updated:2021-10-23 00:26:05.0  )
త్వరలో డంపింగ్ యార్డ్‌లో మరో విద్యుత్ ప్లాంట్
X

దిశ ప్రతినిధి,మేడ్చల్ : జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్‌లో మరో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర సమాచార ప్రచార శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. చెత్త డంపింగ్ యార్డు నుంచి గత కొన్ని రోజులుగా దుర్గంధ భరితమైన వాసన రావటంతో స్థానిక ప్రజాప్రతినిధులు , ప్రజా సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్,జవహర్ నగర్ మేయర్లు గద్వాల విజయ లక్ష్మీ, మేకల కావ్య, జీ హెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్లతో కలిసి డంపింగ్ యార్డ్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సేకరించిన చెత్తను నిర్వీర్యం చేయడంలో ఆలస్యం అవుతుండడం వల్ల వాసన వస్తుందని తెలిపారు. ప్రస్తుతం 20 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. అయితే సేకరించిన చెత్తను ఎప్పటి కప్పుడు క్లియర్ చేసేందుకు రూ.700 కోట్లతో మరో చెత్త విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. నవంబర్‌లో అనుమతులు రాగానే 18 నెలల్లో నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్లాంట్ నిర్మాణం పూర్తి అయ్యే వరకు దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలని రాంకీ సంస్థను ఆదేశించినట్లు తెలిపారు. కాగా చెత్త డంపింగ్ యార్డు వల్ల స్థానికంగా తీవ్ర దుర్గంద భరిత వాసన వస్తుందని దమ్మాయి గూడ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రణీత గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed