మూగజీవి కోసం 150 కి.మీ. ప్రయాణం!

by Shyam |   ( Updated:2020-07-15 04:24:10.0  )
మూగజీవి కోసం 150 కి.మీ. ప్రయాణం!
X

దిశ, వెబ్‌డెస్క్ :
ప్రపంచమంతా కరోనా కల్లోలమే. ఏ నోట విన్నా.. కరోనా బాధితుల హృదయ విదారక సంఘటనలే. సాటి మనిషికి సాయం చేయడానికి కూడా వెనకడుగు వేస్తున్న రోజులివి. సాయం మాట దేవుడెరుగు.. ఆఖరకు వెహికల్‌లో లిఫ్ట్ కూడా ఇవ్వడానికి జంకుతున్నారు. ఇలాంటి కష్టకాలంలోనూ కొందరు చేస్తున్న మంచి పనులు.. మానవత్వం ఇంకా మిగిలే ఉందన్న భావనను కలిగిస్తున్నాయి. తాజాగా కొందరు యువకులు.. ఓ మూగ జీవి కోసం వందకు పైగా కిలోమీటర్లు ప్రయాణించి దాని ప్రాణాలు కాపాడి, అందరితో అభినందనలు అందుకుంటున్నారు.

వరంగల్‌ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం.. ‘నారాయణ తండా’. ఆదివారం రాత్రి సమయంలో ఆ ఊళ్లోని 70 అడుగుల బావిలో ప్రమాదవశాత్తు ఓ కుక్క పడిపోయింది. బయటకు రాలేక, భయంతో బిక్కుబిక్కుమంటూ మొరుగుతూనే ఉంది. ఆ అరుపులు విన్న స్థానికులు రాత్రి 11.30 గంటల ప్రాంతంలో బావిలో పడ్డ కుక్కను గమనించారు. దాన్ని కాపాడాలని ప్రయత్నించినా వారితో కాలేదు. దీంతో హైదరాబాద్‌లోని ‘యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’కి సమాచారం అందజేశారు. జంతు ప్రేమికులు కదా.. వెంటనే స్పందించారు. హుటాహుటిన ఆ కుక్క కోసం హైదరాబాద్ నుంచి దాదాపుగా 150 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి నారాయణ తండాకు చేరుకున్నారు. భారీ తాళ్ల సాయంతో బావిలోకి దిగి ఆ కుక్కను సుక్షితంగా కాపాడారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. అందరికీ తెలిసింది. ఓ మూగ జీవి ప్రాణాల కోసం తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా.. అంత దూరం ప్రయాణించి కాపాడిన ఆ యువకులను అందరూ అభినందిస్తున్నారు. అయినా సాయం చేయాలనే మనుసుంటే.. కరోనాలు, దూరాలు ఏం చేయగలవు? అవి సాకులు చెప్పేవారికి మాత్రమే.. తప్ప సాయం చేసేవారికి కాదని నిరూపించారు.

‘యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’ 14 సంవత్సరాలుగా జంతువుల ప్రాణాలను సంరక్షించే పనిలో ఉంది. ఇప్పటికే ఎన్నో సాహసవంతమైన రెస్క్యూ ఆపరేషన్లు చేసి.. ఎన్నో మూగ జీవాల ప్రాణాలు కాపాడింది.

Advertisement

Next Story