ఎమ్మెల్యే సాక్షిగా అంగన్వాడీ టీచర్లకు ఘోర అవమానం.. మీటింగ్ అని పిలిచి..?

by Shyam |   ( Updated:2021-12-16 06:13:05.0  )
ఎమ్మెల్యే సాక్షిగా అంగన్వాడీ టీచర్లకు ఘోర అవమానం.. మీటింగ్ అని పిలిచి..?
X

దిశ, పరిగి : మహిళలను గౌరవించాలని ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్సుల్లో రాసి ఉండటాన్ని మనం చూసే ఉంటాం. ఈ విషయం బాగా తెలిసిన ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా మహిళలకు గౌరవం ఇవ్వడం లేదని తెలిసింది. తాజా ఘటన దీనికి నిలువుటద్దం పడుతోంది. మీటింగ్ ఉందని పిలిచి అంగన్వాడీ టీచర్లను దాదాపు 45 నిమిషాల పాటు నిలబెట్టారు. ఆ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కూడా ఉండటం విశేషం.. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. పరిగి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ డివిజన్ స్థాయి సమావేశానికి అంగన్వాడీ టీచర్లు అందరినీ పిలిచారు. టీచర్లు అంతా సమావేశపు హాలులో కుర్చీలో కూర్చున్నారు. కానీ ఇద్దరు అంగన్వాడీ టీచర్లు మాత్రం డోర్ దగ్గర నిలబడి ఆద్యంతం మీటింగ్ సారాంశం వినాల్సి వచ్చింది. ఏకంగా 45 నిమిషాలు నిలబడే ఉన్నారు. అంగన్వాడీ టీచర్లు నిలబడే ఉన్నా ఐసీడీఎస్ అధికారులకు మాత్రం కనికరం కలుగలేదు. ఎమ్మెల్యే నిలబడి ఉన్న అంగన్వాడీ టీచర్లను చూసి కూడా.. వారు ఎందుకు నిలబడ్డారు.

వారికి కుర్చీలు ఎందుకు వేయలేదని అడగలేకపోయారు. ఐసీడీఎస్ అధికారులు కూడా వారిని కూర్చోవాలని చెప్పకపోవడంతో సమావేశం ముగిసే వరకు నిలబడే ఉన్నారు. మహిళలకు కనీస గౌరవం ఇవ్వకుండా, మీటింగ్‌కు వచ్చిన వారికి కుర్చీలు వేయాలని చెప్పకుండా అవమానిస్తారా? అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంపై స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, ఐసీడీఎస్ జిల్లా అధికారి లలిత కుమారి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, ఎంపీపీలు కరణం అరవింద్ రావు, సత్యమ్మ, అనుసూయ, మల్లేశం, ఎంపీడీవో శేషగిరి శర్మ, జడ్పీటీసీలు బేతు హరిప్రియ, మేఘమాల తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed