అంగన్‌వాడీ టీచర్.. శెభాష్!

by Aamani |
అంగన్‌వాడీ టీచర్.. శెభాష్!
X

దిశ, ఆదిలాబాద్: లాక్‌డౌన్ పరిస్థితుల్లో ప్రజలు గతంలోలా బయటికి వచ్చే పరిస్థితి లేదు. నిర్ణీత సమయాల్లో మాత్రమే దగ్గరలోని షాపుల్లో నిత్యావసరాలు కొనుక్కునే వీలుంది. ఈ పరిస్థితుల్లో ఓ మహిళ తోపుడు బండిలో సరుకులతో బయటకొచ్చింది. అయితే ఆమె ఏ కిరాణా సరుకులో, కూరగాయలో అమ్ముతుందనుకుంటే పొరపాటే ! చూడ్డానికి అలాగే కనిపిస్తున్నా.. నిజానికి కాదు. వివరాల్లోకెళ్తే..

ఆ మహిళ పేరు బర్కం ప్రసాద. నిర్మల్ జిల్లా, మామడ మండలంలోని మారుమూల అటవీ గ్రామం పరిమండల్‌‌లో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. లాక్‌డౌన్ కారణంగా గ్రామంలో ఉండే గర్భిణులు, బాలింతలు, ప్రీ స్కూల్ పిల్లలు ఆమె పనిచేసే అంగన్‌వాడీ సెంటర్‌కు ప్రతిరోజు రాలేని పరిస్థితి. దీంతో ఆమె తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించేందుకు ఓ ఆలోచన చేసింది. నిత్యం ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని ఒక తోపుడుబండిలో పెట్టుకొని ఇంటింటికీ వెళ్లి సరుకులు అందజేస్తోంది. కోడిగుడ్లు, పాలు, ఇతర పౌష్టికాహారాన్ని ఆమే స్వయంగా లబ్దిదారులకు అందజేస్తూ.. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తోంది. ఒక సామాన్య అంగన్‌వాడీ కార్యకర్త మారుమూల అటవీ గ్రామంలో చిత్తశుద్ధితో పనిచేస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తోంది.

ఇదే విషయమై అంగన్‌వాడీ కార్యకర్త ప్రసాదను పలకరించగా.. ‘అంగన్‌వాడీ కేంద్రంపై అందరికీ ఎన్నో ఆశలు ఉంటాయి. అందులోనూ నిరుపేదలైన పసిపిల్లలు, గర్భిణులు, బాలింతలు ప్రభుత్వం ఇచ్చే పౌష్టికాహారంపైనే ఆధారపడుతున్నారు. అందుకే వారి ఆరోగ్యంతోపాటు తన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించాలన్న ఆలోచనే నన్ను ముందుకు నడిపిస్తోంది. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి తాను ఇలానే తోపుడుబండి సాయంతో లబ్దిదారులకు సరుకులు అందజేస్తున్నానని’ చెప్పారు.

Tags :Lockdown, Anganwadi centres, Pregnant Women, Children, Nutrition food

Advertisement

Next Story