టీడీపీ, జనసేన నుంచి రేసులో ఇద్దరు క్షత్రియ నేతలు

by Anjali |
టీడీపీ, జనసేన నుంచి రేసులో ఇద్దరు క్షత్రియ నేతలు
X

ఉమ్మడి కడప జిల్లాలో వచ్చే ఎన్నికల్లో అయినా రాజులకు టిక్కెట్ లభిస్తుందా ? అనే ప్రశ్న అంతటా వినిపిస్తోంది. ప్రధాన పార్టీల నుంచి ఒక్కసారి కూడా ఈ కమ్యూనిటీకి అవకాశం కల్పించని నేపథ్యంలో రాజులు వచ్చే ఎన్నికల్లో ఎక్కడో ఒక చోట నుంచి ప్రాతినిధ్యం కావాలని ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అన్నమయ్య జిల్లా లోని రాజంపేట నుంచి రాజులుకు టికెట్ ఇచ్చేందుకు ఆశలు చూపినా చివరకు నిరాశే మిగిలింది. అప్పట్లో క్షత్రియులు జిల్లాలో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి ప్రాంతాల్లో క్షత్రియులు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల్లో వారి ఓట్లు ఈ మూడు నియోజకవర్గాల్లో కీలకంగా మారాయి. రెండు చోట్ల నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఎన్నికల ద్వారా ప్రాతినిధ్యం కల్పించేందుకు ఏ ప్రధాన పార్టీ కూడా అవకాశం కల్పించలేదన్న అసంతృప్తి వారిలో ఉంది.


దిశ, కడప ప్రతినిధి: మరో ఐదారు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజంపేటపై రాజులు గురి పెట్టారు. ఇద్దరు క్షత్రియ నేతలు రాజంపేట టికెట్ రేసులో ఉన్నారు .ఇద్దరిలో ప్రముఖ రాజు విద్యా సంస్థల అధినేత జగన్మోహన్ రాజు టీడీపీ నుంచి టికెట్ రేసులో ఉండగా జనసేన నుంచి తన పదవికి స్వచ్ఛంద విరమణ చేసిన ప్రభుత్వ అధికారి వై శ్రీనివాస్ రాజు టికెట్ రేసులో ఉన్నారు. ఇద్దరు కూడా ఆ పార్టీల అధినేత నుంచి టికెట్ పొందేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ చంగల్ రాయుడుతోపాటు జగన్ మోహన్ రాజు టికెట్ కేసులో నువ్వా, నేనా అన్నట్లు ప్రయత్నాలు సాగిస్తున్నారు. జనసేన నుంచి శ్రీనివాసరాజుతోపాటు మరో యువ నాయకుడు అతికారి దినేష్ అనే నాయకుడు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీలలో ఎవరికి టికెట్ దక్కుతుందనేని ఆసక్తిగా మారింది.

ఈ సారి నమ్మకంతో..

జగన్మోహన్ రాజు రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో నిరంతరం శ్రమిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గతంలో టికెట్ ఆశించినా దక్కకపోవడంతో ఈ సారి నమ్మకంతో ఉన్నారు .ఇక జనసేన టికెట్ ఆశిస్తున్న శ్రీనివాసరాజు కడప జిల్లాలో డీఆర్డీఏలో వివిధ స్థాయిలో పని చేస్తూ గుర్తింపు పొందారు. ఆయన సొంత నియోజకవర్గం రాజంపేటలో నందలూరు మండల జెడ్పీటీసీగా ఆయన సోదరుడు శివరామరాజు గతంలో ప్రాతినిధ్యం వహించారు. వీరు నియోజకవర్గ వ్యాప్తంగా గుర్తింపు కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేన నుంచి దేశం పొత్తులో టికెట్ ఆశిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ప్రయత్నాలు సాగిస్తున్నారు.


టీడీపీ, జనసేన నుంచి కాపు సామాజిక వర్గం నేతలు చంగల్ రాయుడు, దినేష్, మరోవైపు క్షత్రియ సామాజిక వర్గం నేతలు జగన్ మోహన్ రాజు, శ్రీనివాసరాజు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండడంతో ఈ సారి రాజులను టికెట్ వరిస్తుందని అంటున్నారు. తెలుగుదేశంగానీ, జనసేనగానీ రాజులకు రాజంపేటలో టికెట్ కేటాయిస్తే మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఆ కమ్యూనిటీ ఓట్లు ఆయా పార్టీలకు సానుకూలంగా మారుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

జనసేన గురి రాజంపేట పైనే..

రాజంపేట అసెంబ్లీపైనే జనసేన గురి పెట్టింది.. అక్కడ జనసేనానికి సానుకూలమైన కమ్యూనిటీతోపాటు, రాజుల కమ్యూనిటీ ఉంది. ఈ అంచనాలతోపాటు తెలుగుదేశం పార్టీకి ఉన్న బలమైన క్యాడర్ కలిసొస్తుందని ఆశిస్తున్నారు. జిల్లాకు ఒక చోట నుంచైనా జనసేన బరిలో దిగే అవకాశం ఉండడంతో అన్నమయ్య జిల్లా నుంచి రాజంపేటపై మంచి ఎంపిక జన సైనికులు భావిస్తున్నారు. ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున జగన్మోహన్ రాజు, జనసేన నుంచి శ్రీనివాసరాజులు టికెట్ రేసులో ఉన్నారు. మరి ఈ సారి రాజులకు టికెట్ ఇవ్వాలనుకుంటే టికెట్ ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed