Kadapa: సోషల్ మీడియా పుణ్యమా అంటూ పుష్పగిరి తిప్పలకు క్యూ కట్టిన జనాలు

by srinivas |
Kadapa: సోషల్ మీడియా పుణ్యమా అంటూ పుష్పగిరి తిప్పలకు క్యూ కట్టిన జనాలు
X

దిశ, ప్రతినిధి, కడప: అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయన్న ప్రచారం చుట్టు పక్కల గ్రామాల వారిని పరుగులు తీయిస్తున్నాయి. ఈ ఆశలతో పుష్పగిరి కొండ తిప్పల్లో వజ్రాల వేట సాగిస్తున్నారు. వైయస్సార్ జిల్లా వల్లూరు మండలంలో దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన పుష్పగిరి ఆలయం పరిసర ప్రాంతాల్లోని భూములు, తిప్పల్లో వజ్రాల కోసం గాలిస్తున్నారు. పుష్పగిరి కొండ ప్రాంతం చుట్టూ వజ్రాలు దొరుకుతున్నాయని ప్రచారం చక్కర్లు కొట్టడంతో జిల్లా నలుమూలలు నుంచి ప్రజలు పుష్పగిరికి వెళ్లి వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. కొంతమందికి వజ్రాలు దొరికాయన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో తాము కూడా వజ్రాల కోసం వచ్చామని వజ్రాలు వేట సాగిస్తున్న వారు పేర్కొంటున్నారు. కొండపై ఏదైనా మెరిసే రాయి కనబడితే వాటిని సంచుల్లో వేసుకొని నగల దుకాణాలు వద్దకు తీసుకెళ్లి పోతున్నారు.


ఐతే రాళ్లను తీసుకెళ్లిన జనాలకు మాత్రం అవి వజ్రాలకాదని తెలిసి నిరుత్సాహ పడుతున్నారు. వజ్రం దొరికితే నాలుగు రాళ్ళు వెనుకేసుకోవచ్చన్న ప్రజలకు నిజంగానే రాళ్ళు మిగులుతున్నాయి. కాని ఇంత వరకూ నిజమైన వజ్రం లభించిన దాఖలాలు కనిపించలేదు. అక్కడ వజ్రాలు వేటలో ఉన్న కొందరు పాత్రికేయులతో మాట్లాడుతూ పుష్పగిరిలో వజ్రాలు దొరుకుతున్నాయని తెలుసుకొని ఇక్కడికి వచ్చామని అంటున్నారు. దొరికేవారికి దొరుకుతున్నాయని, ఒక్కటి దొరికినా తమ తుకులు మారుతాయేనని చిన్న ఆశతో ఈ పుష్పగిరి కొండల్లో వజ్రాల కోసం వేటాడుతున్నామని చెప్పుకొస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed