Kadapa: చీటీల పేరుతో మోసం.. రూ. 2 కోట్ల ఆస్తుల అటాచ్

by srinivas |
Kadapa: చీటీల పేరుతో మోసం.. రూ. 2 కోట్ల ఆస్తుల అటాచ్
X

దిశ, కడప: చీటీల పేరుతో మోసాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి ఆయన నుంచి రూ.2 కోట్ల ఆస్తులను అటాచ్ చేసేందుకు కోర్టుకు సమర్పిస్తున్నట్లు మైదుకూరు డి.ఎస్పీ వంశీధర్ గౌడ్ తెలిపారు. బద్వేలు పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డి.ఎస్పీ మాట్లాడుతూ కాశినాయన మండలం కోడిగుడ్లపాడుకు చెందిన ఓబులేసు పోరుమామిళ్ల రెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్నారన్నారు. 2014 నుంచి అనాథరైజ్డ్ చీట్స్ వ్యాపారం చేస్తున్నారన్నారు. ఓబులేసు వద్ద వ్యాపారులు, చిన్న, చిన్న ఉద్యోగులు చిట్స్ కడుతున్నారన్నారని తెలిపారు. చిట్స్ బాగా నడుపుతుండడంతో చాలా మంది లక్షల రూపాయల చిట్స్ వేశారని చెప్పారు. ఈయన వ్యాపారుల వద్ద వడ్డీలకు డబ్బులు తీసుకోవడమే కాకుండా, చిట్స్ ఎత్తిన వారికి సరిగా డబ్బులు ఇవ్వకుండా పరార్ అయ్యారన్నారు. రఘురామ్ అనే ప్రైవేట్ టీచర్ ఓబులేసు వద్ద చీటీ కట్టి రూ.22 లక్షలు నష్టపోయానని పోరుమామిళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోరుమామిళ్ల పోలీసులు ఓబులేసుపై 420 కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గురువారం పోరుమామిళ్లలో ఓబులేసును అరెస్టు చేశామన్నారు.

కేసు దర్యాప్తులో భాగంగా ఓబులేసు ద్వారా మోసపోయిన దాదాపుగా 82 మంది రూ.4.47 కోట్లు నష్టపోయినట్లు చిట్స్ బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. చిట్స్ ఎత్తిన వారికి, అప్పులు తీసుకున్న వారికి తిరిగి చెల్లించకుండా ఆ డబ్బులతో పోరుమామిళ్ల పట్టణంలోని రెడ్డినగర్‌లో కోటి రూపాయలు పెట్టి 3 ఫ్లోర్స్ ఇళ్లు నిర్మించరాని, రూ.1.5 కోట్లు విలువ చేసే స్థలం, దుగ్గిరెడ్డి అనే వ్యక్తి చెందిన స్థలంలో రెండు ఇళ్లు నిర్మించారని, అలాగే ఇన్నోవా విస్టా కారు కొనుగోలు చేశారన్నారు. ఈ ఆస్థులన్ని దాదాపు రూ.2 కోట్లు అవుతాయని, ఈ ఆస్తులను అటాచ్ చేసేందుకు కోర్టుకు సమర్పిస్తున్నామన్నారు. ఇంకా ఓబులేసు బినామీ స్థలాలు, ఇళ్లు వివరాలు కోసం బద్వేలు సబ్ రిజిస్టర్ ఆఫీసు, తహశీల్దారర్ కార్యాలయాల నుంచి సమాచారం సేకరిస్తున్నామన్నారు. అలాగే జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కూడా లేఖలు రాశామన్నారు. బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేశామన్నారు. ఓబులేసుకు చెందిన అటాచ్డ్ ఆస్తులను కోర్టు ద్వారా బాధితులకు అందజేస్తామన్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ముందుకు వస్తే వారికి న్యాయం చేస్తామని డి.ఎస్పీ తెలిపారు.



Next Story