విశాఖ మేయర్ పీఠంపై టీడీపీ కన్ను.. అలర్ట్ అయిన వైసీపీ

by srinivas |
విశాఖ మేయర్ పీఠంపై టీడీపీ కన్ను.. అలర్ట్ అయిన వైసీపీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. కూటమిగా ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీకి ప్రజలు 164 స్థానాల్లో పట్టం కట్టారు. దీంతో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అయితే మేజర్ సిటీలపై కూటమి నాయకుల కన్ను పడినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్లుగా ఉన్న కార్పొరేషన్లను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా విశాఖ స్మాట్ సిటీపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో విశాఖ జిల్లాలో మెజార్టీ ఎమ్మెల్యేలు గెలిచినా కార్పొరేషన్‌లో మాత్రం ఆ స్థాయి ఆధిక్యం లేదు. విశాఖలో వైసీపీ కార్పొరేటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆ పార్టీ కార్పొరేటర్ నే మేయర్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు అధికారంలోకి టీడీపీ రావడంతో ఎలాగైనా సరే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం.

ఈ పరిణామాలతో అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. పార్టీ కార్పొరేటర్లు ఫిరాయించకుండా ముందు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ కార్పొరేటర్లతో వైవీ సుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. విశాఖ మేయర్ పీఠంపై తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నుపడిందని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఫిరాయించొద్దని సూచించారు. అలాగే ప్రలోభాలకు సైతం లొంగవద్దని తెలిపారు. పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్ అన్ని విధాలుగా అందుబాటులో ఉంటారని, పార్టీకి తెలియకుండా ఎలాంటి నిర్ణయాలు, కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించారు. జీవీఎంసీ పరిధిలో వైసీపీ కార్పొరేటర్లు ఎక్కువగా ఉన్నారని, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిందుకు ఇది మంచి అవకాశమని ఆ పార్టీ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

Next Story

Most Viewed