వైఎస్ జగన్ ప్రజల రక్తం తాగే జలగ: నారా లోకేశ్

by Seetharam |   ( Updated:2023-12-01 07:49:44.0  )
వైఎస్ జగన్ ప్రజల రక్తం తాగే జలగ: నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : జగన్మోహన్ రెడ్డి ప్రజల రక్తంతాగే జలగలా తయారై పన్నుమీద పన్నులతో మోయలేని భారం మోపుతున్నాడు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక రవాణా రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు అని ఆరోపించారు. కాకినాడ జిల్లా చొల్లంగిపేట క్యాంప్ సైట్ నుంచి 214వ రోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. ఇకపోతే లోకేశ్ నేడు కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం సర్పవరం జంక్షన్ బహిరంగ సభలో నారా లోకేశ్ మాట్లాడనున్నారు. ఇకపోతే కాకినాడ సినిమారోడ్డులో మినీ వ్యాన్ ఓనర్స్ యూనియన్ ప్రతినిధులు యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుండి తాము నష్టాల ఊబిలో కూరుకుపోయాం అని మినీ వ్యాన్ ఓనర్స్ యూనియన్ ప్రతినిధులు ఆరోపించారు. ‘రోడ్లు పాడైపోయి వాహనాలు దెబ్బతిని తరచూ రిపేర్లు వస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మినీవ్యాన్లపై ట్యాక్సులు అడ్డగోలుగా పెంచి దోచేస్తున్నారు. గతంలో రూ.3వేలు ఉండే ట్యాక్స్ ను రూ.3,600కు పెంచారు. గ్రీన్ ట్యాక్స్ టీడీపీ పాలనలో రూ.200 ఉండేది..వైసీపీ సర్కార్ రూ.6వేలకు పెంచారు. ఓవర్ లోడ్ ట్యాక్స్ టన్నుకు గతంలో రూ.2వేలు ఉండేది..నేడు రూ.20వేలకు పెంచారు. మీరు అధికారంలోకి వచ్చాక ట్యాక్సులు తగ్గించి మినీ వ్యాన్ ఓనర్లను ఆదుకోవాలి’ అని నారా లోకేశ్‌కు మినీ వ్యాన్ ఓనర్స్ కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మినీ వ్యాన్ ఓనర్స్‌ను ఆదుకుంటామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

మినీ వ్యాన్ ఓనర్స్‌ను ఆదుకుంటాం

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక రవాణా రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. డీజిల్ ధరలు, ట్యాక్సులు ఇష్టారాజ్యంగా పెంచి వేధిస్తున్నాడు అని ఆరోపించారు. రోడ్లన్నింటినీ గుంతలమయంగా మారినా నాలుగున్నరేళ్లుగా తట్టెడు మట్టికూడా పోయడం లేదు అని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక గ్రీన్ ట్యాక్స్, ఓవర్ లోడ్ ట్యాక్స్ తగ్గిస్తాం అని లోకేశ్ హామీ ఇచ్చారు. పాడైపోయిన రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు నిర్మిస్తాం అని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

తిరుమల లడ్డూ నాణ్యతా ప్రమాణాలు తగ్గిపోతున్నాయి

తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యతా ప్రమాణాలపై నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ నాణ్యతా ప్రమాణాలు తగ్గిపోతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి అని ఆరోపించారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ కల్లా ఈ సమస్య పరిష్కారమవుతుంది అని లోకేశ్ హామీ ఇచ్చారు. టీడీపీ అధికారం చేపట్టగానే భక్తులకు పూర్తి నాణ్యతతో తిరుమల లడ్డూ అందిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు.


మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం

కాకినాడలో అత్యధిక జనాభా కలిగిన మత్స్యకారుల సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం గాలికొదిలేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. కాకినాడ రూరల్‌లో నారా లోకేశ్‌ను మత్స్యకారులు కలిశారు. కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఎటువంటి నిధులు కేటాయించకుండా తీవ్రంగా దగా చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం కింద మత్స్యకారులకు సబ్సిడీపై బోట్లు, వలలు, ఇతర పనిముట్లు అందజేశామని లోకేశ్ గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మత్స్య సంపదను అమ్ముకునేందుకు అనువైన షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. కాకినాడలో మత్స్యకారుల పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపర్చి స్థానిక మత్స్యకార యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story