AP నారీ లోకం ఎటువైపు.. మహిళలే టార్గెట్‌గా YCP, జనసేన, టీడీపీ పాలిటిక్స్..!

by Satheesh |   ( Updated:2023-08-12 05:34:35.0  )
AP నారీ లోకం ఎటువైపు.. మహిళలే టార్గెట్‌గా YCP, జనసేన, టీడీపీ పాలిటిక్స్..!
X

మహిళల భాగస్వామ్యం లేకుండా విజయం సాధించలేమని అలనాటి స్వతంత్ర ఉద్యమంలోనే బాపూజీ గుర్తించారు. రానున్న ఎన్నికల్లో మహిళలను ప్రసన్నం చేసుకుంటే చాలని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అధికార వైసీపీ మాత్రం నాలుగేళ్ల నుంచి సంక్షేమ పథకాల్లో సింహభాగం మహిళలకే వర్తింపజేస్తోంది. ఇది గమనించిన ప్రతిపక్షనేత చంద్రబాబు తెలుగు మహిళల ప్రచార భేరీ నిర్వహిస్తున్నారు.

అందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇక లోకేశ్​యువగళం యాత్రలో సెల్ఫీ కార్యక్రమంలోనూ యువతులే ఎక్కువగా పాల్గొంటున్నారు. జనసేనలో వీర మహిళలు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. శ్రామిక మహిళలు, గృహిణులు మాత్రం కుటుంబాలను నెట్టుకురాలేక నానా అవస్థలు పడుతున్నారు. ఓటర్లలో సగభాగంగా ఉన్న మహిళలు ఈ దఫా ఎన్నికల్లో ఎవరికి జై కొడతారనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 80 శాతం లబ్దిదారులు మహిళలే. అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, జగనన్న మార్టులు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకంతోపాటు విద్యకు సంబంధించిన అన్ని పథకాల సొమ్ము తల్లుల ఖాతాలకే జమ చేస్తున్నారు. మహిళలకే ఇంటి పట్టాలు ఇచ్చి గృహ నిర్మాణం చేపడుతున్నారు. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల నియామకంలో యువతులకు తగు ప్రాధాన్యమిచ్చారు. ఇలా ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమంలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నారు. అందువల్ల ఎన్నికల్లో వారు తమనే ఆదరిస్తారని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.

అప్రమత్తమైన చంద్రబాబు..

ఈ ఎత్తుగడను టీడీపీ అధినేత పసిగట్టారు. తెలుగు మహిళలకు శిక్షణ ఇచ్చి ప్రచార భేరీకి సిద్దం చేశారు. ప్రతి నియోజకవర్గంలో బస్సు యాత్ర ద్వారా మహిళలను కలుస్తున్నారు. టీడీపీ మ్యానిఫెస్టోను బలంగా మహిళల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రధానంగా అమ్మకు వందనం పేరుతో ఎంతమంది పిల్లలున్నా ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెబుతున్నారు.

ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకూ నెలకు రూ.1500, దీపం పేరుతో ప్రతి కుటుంబానికీ ఏడాదిలో మూడు వంట గ్యాస్​సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీనిస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెబుతున్నారు. యువతకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామంటున్నారు. దీంతో మహిళా ఓటర్లు తమకే మద్దతిస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

మహిళలకు ప్రోత్సాహం..

మరోవైపు నారా లోకేశ్​యువగళం పాదయాత్రలో సెల్ఫీ విత్​లోకేష్​ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో ప్రధానంగా యువతులు పాల్గొనేట్లు నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నారు. జనసేనలోనూ వీర మహిళలు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేకంగా కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలు చొరవ తీసుకొని ముందుకొస్తున్నారు.

వీరి గోడు పట్టించుకునేదెవరు..

ఇంకోవైపు శ్రామిక మహిళలు, గృహిణులు కుటుంబాల భారాన్ని మోయలేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుతున్నా నిరంతరం పెరుగుతున్న ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోలు, డీజిల్​ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. దీనికి తోడు జీఎస్టీ బాదుడుతో నెలవారీ సరకుల బడ్జెట్​50 శాతం అదనంగా పెరిగింది. వంట గ్యాస్​ధర రెండింతలైంది. ఆస్తి పన్నులు పెరగడంతో ఇంటి అద్దెలు పెరిగాయి. కరెంటు చార్జీలు పైతం రెట్టింపయ్యాయి.

ప్రధాన పార్టీల్లో గుబులు..

మద్యం ధరలు పెరగడంతో సగటు కుటుంబాల్లో మగవాళ్ల సంపాదనలో ఇంటి ఖర్చులకు ఇచ్చే వాటా తగ్గిపోయింది. దీంతో కుటుంబాలను నెట్టుకురాలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ బాధల నుంచి విముక్తి కోసం ఈసారి ఏ పార్టీకి జై కొడతారనేది అంచనాకు చిక్కడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ అసంతృప్తి ఏ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందోనని ప్రధాన పార్టీల్లో గుబులు నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed