పెడన వారాహి యాత్రలో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ కుట్ర : Pawan Kalyan

by Seetharam |   ( Updated:2023-10-04 07:11:59.0  )
పెడన వారాహి యాత్రలో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ కుట్ర : Pawan Kalyan
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన పార్టీ చేపట్టిన వారాహి విజయ యాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని జగన్ ప్రభుత్వం చూస్తోంది అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. అల్లరి మూకలతో గొడవలు సృష్టించి భయబ్రాంతులకు గురి చేయాలని , కేసులతో ఇబ్బందులు పెట్టాలని ప్రణాళిక రచిస్తున్నట్లు తన దగ్గర సమాచారం ఉందని అన్నారు. బుధవారం జరగబోయే పెడన నియోజకవర్గ వారాహి విజయయాత్ర సభలో రౌడీమూకలు , గూండాలు , అల్లరి మూకలను దించి సభపై రాళ్ల దాడి చేయించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది అని పవన్ కల్యాణ్ ఆరోపించారు. సభలో ఎలాంటి అలజడులు సృష్టించినా దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. మచిలీపట్నంలో మంగళవారం నిర్వహించిన జనవాణి - జనసేన భరోసా కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడారు.‘వైసీపీ నాయకుడికి , డీజీపీకి , హోం మంత్రికి , పోలీస్ అధికారులకు స్పష్టంగా చెబుతున్నా .. పెడన సభలో కనుక ఏవైనా గొడవలు పెట్టుకోవాలని చూస్తే ఏ మాత్రం సహించేది లేదు’ అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఏం జరిగినా వారే పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

పొత్తును చెడగొట్టేందుకు వైసీపీ దుష్టపన్నాగాలు

వచ్చే ఎన్నికల్లో జన సైనికులు , తెలుగు తమ్ముళ్ల కలయికను ఎలాగైనా చెడగొట్టేందుకు వైసీపీ దుష్ట పన్నాగాలు పన్నుతోంది అని జనసేనాని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇరు పార్టీల మధ్య ఎలాగైనా చిచ్చు పెట్టాలని భావిస్తోందని మండిపడ్డారు. జనసేన, తెలుగుదేశం పార్టీల కలయికకు విఘాతం కలిగించేలా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది అని మండిపడ్డారు.రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్ర డీజీపీనే బాధ్యత వహించాలి అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. సభలో ఏ మాత్రం రాళ్ల దాడి జరిగినా , గూండాలు చెలరేగినా పోలీసులే వారిని నిలువరించాలి అని సూచించారు. రాష్ట్రంలో పులివెందుల రౌడీయిజం చేయిస్తే సహించేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు. క్రిమినల్ మైండ్‌తో ఏపీలో గొడవలు సృష్టించాలని సీఎం చూస్తున్నారని ఆరోపించారు. వారాహి విజయ యాత్ర సభలో ఎవరైనా అగంతకులు రాళ్ల దాడికి దిగినా జన సైనికులు , తెలుగు తమ్ముళ్లు ఎదురు దాడికి దిగవద్దు. రాళ్ల దాడి చేసే వారిని చుట్టుముట్టి పోలీసులకు అప్పగిద్దాం. అంతా కలిసి పోలీస్ స్టేషన్‌కు తీసుకొని వెళ్లాం . ఎవరైనా సభలో అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే వారిని పోలీసులకు అప్పగించండి అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

జగన్ క్రిమినల్ వేషాలను సహించేది లేదు

వారాహి విజయయాత్ర సభలో కత్తులు , మరణాయుధాలు తీసుకొచ్చే వారిని చుట్టుముట్టి బంధించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఎదురు దాడి చేయోద్దని సూచించారు. గతంలో అమలాపురం వారాహి విజయయాత్ర సందర్భంగా అక్కడ విధ్వంసం సృష్టించేందుకు కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నించింది. మళ్లీ ఇప్పుడు కూడా అదే పద్ధతిలో సుమారు రెండు , మూడు వేల మంది కిరాయి మూకలను తీసుకొచ్చే అవకాశం ఉందని తనకు సమాచారం ఉందన్నారు. ఏ మాత్రం ఏమరపాటు తగదు. అంతా అప్రమత్తంగా ఉండండి అని సూచించారు. జగన్ ఇలాంటి క్రిమినల్ వేషాలు వేస్తే సహించేది లేదు అని హెచ్చరించారు. అధికారం నుంచి దిగిపోతున్నామని తెలిసీ , వైసీపీ నాయకుడు అల్లర్లు , గొడవలు రాష్ట్రంలో సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అని విరుచుకుపడ్డారు. రాబోతున్న జనసేన , తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తాం అని పవన్ కల్యాణ్ తెలిపారు. బుధవారం జరిగే పెడన వారాహి విజయయాత్ర సభలో ఏం జరిగినా కచ్చితంగా ముఖ్యమంత్రి జగన్ బాధ్యత తీసుకోవాల్సిందేనని పవన్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర హోంమత్రి , డీజీపీ , ఇతర పోలీసు అధికారులు దీనికి బాధ్యత వహించాల్సిందేనని అన్నారు. తాము పూర్తిగా పోలీసులకు సహకరిస్తూ కార్యక్రమాలు చేసుకుంటాం..అలాగే తమకు తగిన విధంగా వ్యవస్థలు సహకరిస్తాయని భావిస్తున్నాం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి : పవన్‌పై వ్యాఖ్యల ఎఫెక్ట్: పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు?

Advertisement

Next Story