సీట్ల ప్రకటనతో టీడీపీలో జోష్.. ఒక్కసారిగా డీలా పడిపోయిన వైసీపీ!

by GSrikanth |
సీట్ల ప్రకటనతో టీడీపీలో జోష్.. ఒక్కసారిగా డీలా పడిపోయిన వైసీపీ!
X

ఇదో అనూహ్య పరిణామం. టీడీపీ అధినేత చంద్రబాబు ధోరణికి విభిన్నం. ఒకేసారి 94 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయడం టీడీపీ శ్రేణుల్లో జోష్​ నింపింది. తొలి జాబితాలో సీట్లు దక్కని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఇన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించడంతో వైసీపీ ఉలిక్కిపడింది. ఆ పార్టీ నేతలు టీడీపీ – జనసేన పార్టీల పొత్తుపై విమర్శలు గుప్పించారు. ఇవన్నీ ఓ ఎత్తయితే.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు మరో బాంబు పేల్చారు. ఇప్పటిదాకా ప్రకటించిన వైసీపీ ఇన్​చార్జులు కేవలం సమన్వయకర్తలే.. అభ్యర్థులు కాదని సెలవిచ్చారు. దీంతో వైసీపీ నేతలు మరింత డీలా పడ్డారు. వైవీ అలా వ్యాఖ్యానించడం వెనుక కారణమేంటో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు అవతలి పక్షం ఎవర్ని అభ్యర్థులుగా రంగంలోకి దించుతుందోనని వేచిచూసేవారు. వారికి దీటైన నేతలను పోటీకి నిలిపేందుకు నామినేషన్ల గడువు ముగిసేదాకా ఎదురు చూసే వారు. దీనికి భిన్నంగా అభ్యర్థుల ఎంపిక కోసం చంద్రబాబు ఇపుడు చాలా కసరత్తు చేశారు. మరోవైపు పొత్తులో ఉన్న జనసేనతో సమన్వయం చేసుకుంటూ అభ్యర్థులను ఖరారు చేశారు. సీట్ల ఎంపికలో సామాజిక సమతుల్యతను పాటించినట్లు కనిపిస్తోంది. మొత్తం 94 మందిలో కమ్మ 21, రెడ్లు 17, ఎస్సీ 20, బీసీలు 18, కాపులు 7, ఎస్టీలు 3, క్షత్రియ 4, వైశ్య 2, వెలమ, మైనార్టీలకు ఒక్కో సీటును ప్రకటించారు.

వైసీపీలో ప్రకంపనలు..

గత ఎన్నికల్లో టీడీపీ బీసీలకు 43 సీట్లు కేటాయించింది. ప్రస్తుతం తొలి జాబితాలో ఖరారు చేసిన 18 పోను మిగతా 25 సీట్లు ఇంకా ప్రకటించాల్సిన 57లో ఉండొచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. జనసేనకు కేటాయించిన 24 సీట్లలో పవన్​ కల్యాణ్​ ఐదుగుర్ని ప్రకటించారు. అందులో కాపులకు రెండు, కమ్మ, బ్రాహ్మణ, గవర సామాజిక వర్గాలకు ఒక్కొక్కటి ఇచ్చారు. నాగబాబు, తను ఎక్కడ నుంచి పోటీ చేసేది వెల్లడించలేదు. టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదలతో వైసీపీలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ నేతలు సజ్జల, అంబటి, రోజా యథాశక్తితో పవన్​ కల్యాణ్​పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు కోసమే పవన్​పనిచేస్తున్నట్లు విమర్శించారు.

వైవీ వ్యాఖ్యల వెనుక మర్మం?..

అభ్యర్థుల ఖరారుతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. తొలి జాబితాలో సీటు దక్కని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇప్పటిదాకా నియమించిన ఇన్​చార్జులు కేవలం సమన్వయకర్తలేనని, వాళ్లే అభ్యర్థులు కాదని ప్రకటించారు. దీంతో ఇప్పటిదాకా తామే అభ్యర్థులుగా భావించి నియోజకవర్గాల్లో ఖర్చుపెడుతూ పనిచేసుకుపోతున్న వాళ్ల గుండెల్లో గునపం దిగినట్లయింది. వైవీ వ్యాఖ్యలతో అయోమయంలో పడిపోయారు. సీట్లు దక్కని వాళ్లు, కోల్పోయిన వాళ్లకు మరో చాన్స్​ ఉందని చెప్పేందుకు వైవీ అలా వ్యాఖ్యానించారా.. వలసలను నిరోధించేందుకే అలా మాట్లాడారా అనేది వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story