పవన్​దారెటు?

by Anjali |   ( Updated:2023-04-06 02:39:34.0  )
పవన్​దారెటు?
X

ఒక భావజాలంతో నడిచే పార్టీలు ఎన్నికల్లో ఓడినా వాటి బలానికి వచ్చే ఢోకా లేదు. అదే ఒక వ్యక్తి కేంద్రంగా నడిచే ప్రాంతీయ పార్టీలు అధికారం లేకుంటే ఉనికి కోల్పోయే ప్రమాదముంది. అలాంటిది గత ఎన్నికల్లో చేదు అనుభవాలను చవిచూసిన జనసేన పార్టీ పనైపోయిందనుకున్నారు. పడిలేచిన తరంగంలా పవన్​కల్యాణ్​మళ్లీ పార్టీకి ఊపిరి పోశారు. గతంకన్నా పార్టీకి మరిన్ని జవసత్వాలు చేకూర్చారు. గడచిన నాలుగేళ్లలో చేపట్టిన వివిధ కార్యక్రమాలు ప్రజల్లో మరింత పలుకుబడిని పెంచాయి. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఆ ఎత్తుగడల్లో భాగంగానే టీడీపీతో కలిసి ప్రయాణం చేయాలని భావించారు. అందుకు బీజేపీ మోకాలడ్డుతోంది. ఇప్పుడు పవన్​దారెటు? అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

దిశ, ఏపీ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఇప్పటిదాకా ఓ క్లారిటీ ఉంది. వైసీపీ అధినేత వైఎస్ ​జగన్​ అంత విశ్వాసపాత్రుడు మరొకరు లేరన్నట్లుగా వాళ్ల బంధం కొనసాగుతోంది. అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్న వాటికి నిధులు ఇవ్వకున్నా.. అప్పు కావాలన్నప్పుడల్లా ఏదో ఒక షరతు పెట్టి సహకరిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయడానికి వెనకడుగు వేసే విధానాలను సైతం సీఎం జగన్​తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. సీఎం జగన్​మళ్లీ ఎన్నికల్లో సునాయాసంగా గెలవాలంటే జనసేన టీడీపీతో కలవకూడదని భావిస్తున్నారు. అందుకే బీజేపీ పెద్దలు జనసేనను వెనక్కి లాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీని విషయమై తాడోపేడో తేల్చుకోవాలని పవన్​నిర్ణయించుకున్నారు. అందుకోసమే ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. రెండు రోజులు వేచి చూసినా అగ్ర నేతల దర్శనం లభించలేదు. ఈ నిర్లక్ష్యాన్ని పవన్​అసలు సహించలేకపోతున్నట్లు తెలుస్తోంది.

దిగజారితే కోలుకోవడం కష్టమే..

బీజేపీ ఈదఫా ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయడం వల్ల ఒక్క సీటు కూడా దక్కకపోవచ్చు. మళ్లీ వైసీపీ గెలవొచ్చు. టీడీపీ ఓడిపోతే ఆ పార్టీ మరింత బలహీనపడుతుంది. అప్పుడు బీజేపీ, జనసేన కూటమి ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతాయని కమలనాధులు జన సైనికుల్లోకి బాగా ఎక్కించారు. టీడీపీ ఓడితే పార్టీ నాయకులు బలహీనపడొచ్చు. ఆ పార్టీ పునాదులు ఎక్కడా చెదరవు. దాదాపు 40 శాతం ఓటర్ల బలం అలాగే ఉంటుంది. ఇక్కడ జనసేన పరిస్థితి వేరు. ఇంకా క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం వేళ్లూనుకోలేదు. సామాజిక వర్గ బలం గ్యారెంటీ లేదు. సరైన ఓటు బ్యాంకు కూడా లేదు. మళ్లీ మునుపటి పరిస్థితికి పార్టీ దిగజారితే ఇక కోలుకోవడం కష్టం. బీజేపీకి పోయేదేమీ లేదు. కష్టం.. నష్టమంతా జనసేనకేనని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అధినేత నిర్ణయం కోసం ఎదురుచూపులు

ఢిల్లీలో కమలనాధులతో చర్చించాక జనసేనాని తాను తీసుకోదలచిన నిర్ణయాన్ని ఇప్పుడే ప్రకటించకపోవచ్చు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన పనిచేస్తుందని మాత్రం చెబుతున్నారు. పొత్తుల గురించి ఇంకా లోతుగా చర్చించలేదంటున్నారు. ప్రస్తుతానికి పార్టీ బలోపేతంపై దృష్టిసారించనున్నట్లు ఆయన ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తే నష్టమెంత ? ఆ తర్వాత పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది ? అదే టీడీపీతో కలిసి వెళ్తే ఎన్ని సీట్లు రావొచ్చు. ఏమేరకు విజయావకాశాలున్నాయి.. అనే అంశాలపై లోతుగా చర్చించి ఎన్నికలు సమీపించిన తర్వాత ఓ నిర్ణయానికి రావొచ్చని జనసేన వర్గాల నుంచి వినిపిస్తోంది. అప్పటిలోగా బీజేపీ పెద్దల నిర్ణయంలో మార్పు రావొచ్చన్న ఆశలూ ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో జనసేన నిర్ణయం ప్రధాన పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి.

Read more:

Chandrababu: అభ్యర్థి ఎవరు అనేది కాదు...జెండా గెలవాలి

Advertisement

Next Story

Most Viewed