Pallakolluలో వైసీపీ భారీ స్కెచ్.. ఇద్దరు కీలక నేతలకు గాలం?

by srinivas |   ( Updated:2022-11-23 13:29:23.0  )
Pallakolluలో వైసీపీ భారీ స్కెచ్.. ఇద్దరు కీలక నేతలకు గాలం?
X
  • ఈసారి పాలకొల్లులో వైసీపీ జెండా పాతాలనే ఆలోచన
  • నియోజకవర్గంలో పార్టీ వీక్‌గా ఉందని సర్వే రిపోర్టులు
  • స్థానిక ఎమ్మెల్యేకు తీర్థం ఇచ్చే ప్రయత్నం
  • మంత్రిగా అవకాశం ఇస్తామని గాలం
  • నో చెప్పిన ఎమ్మెల్యే
  • మాజీ మంత్రి వద్దకు వెళ్లిన పంచాయితీ
  • ఆయనకు కూడా బంపర్ ఆఫర్
  • పాలకొల్లు సీటుతో పాటు మంత్రి పదవి ఆశ

దిశ (ఉభయ గోదావరి): వైసీపీ అధినాయకులు పాలకొల్లుపై పెద్ద స్కెచ్ వేశారు. గత రెండు పర్యాయాల నుంచి పార్టీ ఓటమి పాలవ్వడంతో ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యాన్ని పెట్టుకొన్నారు. పాలకొల్లులో జెండా ఎగర వేస్తే ఆ ప్రభావం జిల్లా అంతా ఉంటుందనే ధీమాలో ఉన్నారు. దీంతో ఇక్కడ ధీటైన వ్యక్తి కోసం వారు అన్వేషణ ప్రారంభించారు. ముందుగా స్థానిక శాసన సభ్యుడు నిమ్మల రామానాయుడుకు గాలం వేశారు. అతడికి తక్షణమే మంత్రి పదవి ఆఫర్ కూడా చేశారు. అంతేగాక పార్టీలో కీలక పాత్ర ఇస్తామని అన్నారు. దీనికి నిమ్మల వెంటనే నో అని చెప్పారు. అయితే జిల్లాలో బీసీ నాయకుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వద్దకు పంచాయితీ వెళ్లింది. ప్రస్తుతం ఆచంట నియోజకవర్గం టీడీపీ ఇంచార్జిగా ఉన్న పితానిని పాలకొల్లు నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయనే నమ్మకంతో ఉన్నారు. బిసిల్లో పార్టీకి మంచి ఊపు వస్తుందని భావిస్తున్నారు. వాస్తవానికి పితానిది పాలకొల్లు నియోజకవర్గమే కావడంతో స్థానికుడు అనే భావంతో ప్రజల మద్దతు బాగా ఉంటుందనే నమ్మకంలో అధిష్టానం ఉంది. ఈ విషయం జిల్లా అంతా పెద్ద చర్చగా మారింది. ముఖ్యంగా పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

రాష్ట్రంలో వైసీపీ గాలి బలంగా వీచినా పాలకొల్లులో మాత్రం స్లో అయింది. దీనికి కారణం తమ పార్టీ నుంచి ధీటైన అభ్యర్థి లేకపోవడమేనని గుర్తించింది. ఇక్కడ సరైన అభ్యర్థి ఉంటే ఖచ్చితంగా గెలుస్తామని భావిస్తుంది. దీంతో తమ పాచికలు వేయడం ప్రారంభించింది. పాలకొల్లులో పార్టీ బలంగా ఉంటే చుట్టు ప్రక్కల నియోజకవర్గాలు ఆచంట, రాజోలు, భీమవరం, నరసాపురం వంటి ప్రాంతాల్లో పార్టీ మరింత బలంగా ఉంటుందని నమ్ముతున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండటంతో ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ వరుసగా పరాజయం పొందింది. వాస్తవానికి 2019లో చాలా నియోజకవర్గాల్లో కొత్త వ్యక్తులు గెలిచారు. కానీ పాలకొల్లులో మాత్రం గెలవకపోవడంతో పార్టీ పెద్దలు మదన పడుతున్నారు. దీంతో ఈసారి ఎలాగైనా పెద్ద స్కెచ్ వేసి పాలకొల్లులో వైసీపీ జెండా ఎగరవేయాలనే ఆలోచనలో ఉన్నారు.

స్థానిక శాసన సభ్యుడు నిమ్మలకు గాలం


నిమ్మల రామానాయుడు స్థానిక శాసన సభ్యుడిగా సేవలందిస్తున్నారు. టీడీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రజా పోరాటాల విషయంలో ఈయనకు ఈయనే సాటి. నిత్యం సైకిల్ మీద తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని వారి మన్ననలు పొందుతున్నారు. అటు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష పాత్ర చక్కగా పోషిస్తున్నారు. శాసనసభ ఉపపక్ష నాయకుడిగా వాడీ వేడీ చర్చల్లో పాల్గొంటున్నారు. ఇటీవల టీడీపీ నిర్వహించిన పోరు బాటలో నిమ్మల మంచి పేరు తెచ్చుకొన్నారు. పాలకొల్లులో నిమ్మలకు వ్యక్తిగతంగా మంచి పేరుంది. పలు సర్వేల్లో నిమ్మల ప్రస్తావనలో సానుకూలమైన రిపోర్టులు వస్తున్నాయి. అయితే 2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో నిమ్మలకు మంత్రి పదవి దక్కుతుందని ఆయన అనుచరులు భావించారు.

తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన నిమ్మకాయల చిన రాజప్పకు మంత్రి పదవి ఇచ్చిన విధంగా పశ్చిమలో అదే సామాజిక వర్గానికి చెందిన రామానాయుడుకు కూడా ఇస్తారని అనుకున్నారు. అందుకోసం రామానాయుడు గట్టి ప్రయత్నాలు చేసినట్లే సమాచారం. కానీ నాడు రామానాయుడు అభ్యర్ధనను అధిష్టానం పట్టించుకోలేదు. అప్పట్లో రామానాయుడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఇదంతా పార్టీలోనే అంతర్గంతంగా కుమ్ములాట జరిగింది. అయితే ప్రస్తుతం వైసీపీ దీన్నే అవకాశంగా తీసుకొన్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఇవ్వలేనిది తాము ఖచ్చితంగా ఇచ్చి చూపిస్తామని వైసీపీ నేతలు అంటున్నారట. పార్టీలోకి వస్తే తక్షణమే మంత్రి పదవి కట్టబెడతామని చెప్పారటన. అయితే నిమ్మల మాత్రం అందుకు ససేమిరా అన్నారని తెలుస్తోంది.

పితాని వద్దకు వెళ్లిన పంచాయితీ


అయితే నిమ్మల నో అనడంతో పంచాయితీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వద్దకు వెళ్లింది. పితాని 2004లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. 2009లో అదే పార్టీ నుంచి గెలుపొందారు. అప్పట్లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ హయాంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే 2019లో పార్టీ ఓటమి పాలయ్యాక స్తబ్దుగా ఉండిపోయారు. అధిష్టానం కూడా ఆయనపై గుర్రుగా ప్రవర్తించింది. వాస్తవానికి పితాని సత్యనారాయణ సొంత ఊరు పాలకొల్లు నియోజవకర్గం కొమ్ము చిక్కాల. అయితే పితాని ప్రస్తుతం ఆచంట నియోజకవర్గం టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు. అయితే వైసీపీ అధిష్టానం పితానికి గాలం వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో పాలకొల్లు సీటు ఇస్తామని, గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తామనే బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ఇందుకు పితాని తన అభిప్రాయం చెప్పలేదు. వాస్తవానికి పితాని మాజీ మంత్రి హరిరామజోగయ్య శిష్యుడు. రాజకీయంగా ఆయన సలహాతోనే ముందుకు వెళ్తారు. అయితే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed