AP News:మహిళల జీవితాల్లో దీపకాంతులు.. ఉచిత గ్యాస్ సిలెండర్లతో ఆనందం

by Jakkula Mamatha |   ( Updated:2025-01-02 13:07:39.0  )
AP News:మహిళల జీవితాల్లో దీపకాంతులు.. ఉచిత గ్యాస్ సిలెండర్లతో ఆనందం
X

దిశ ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దీపం 2 పథకం లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తోంది. మహిళల బతుకుల్లో దీప కాంతులు నింపే విధంగా రూపొందించిన ఈ పథకం ద్వారా ఉచిత సిలిండర్లు లబ్దిదారులకు అందుతున్నాయి. ఏలూరు జిల్లాలో 4.75 లక్షల కుటుంబాలకు ఉచిత సిలిండర్లు జిల్లా యంత్రాంగం అందిస్తోంది. జిల్లాలో 6.53,815 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 4,75,723 మంది లబ్దిదారులను ఇప్పటికే గుర్తించారు. వారికి ఏడాదికి మూడు సిలెండర్లు అందిస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ పి ధాత్రి రెడ్డి వెల్లడించారు. దీనిలో భాగంగా తొలి సిలెండర్‌ను మార్చి 31లోగా బుక్‌ చేసుకున్న వారికి సిలెండర్‌ డెలివరీ సమయంలో గానీ, గ్యాస్‌ ఏజన్సీకి గానీ లబ్దిదారుడు సొమ్ము చెల్లించాలి. వారు చెల్లించిన మొత్తాన్ని 48 గంటల వ్యవధిలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తోందని ఆమె వివరించారు.

నవంబర్‌ ఒకటి నుండి ఈ పథకం అమలులోకి వచ్చింది. కట్టెల పొయ్యిలతో మహిళలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 1996లోనే డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలను ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించి కొత్త అధ్యాయానికి నాంది పలికారు. నాలుగోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీపం పథకం కింద తెల్ల కార్డుండి గ్యాస్ కనెక్షన్ ఉన్న మహిళలు లబ్ధిదారులందరిని అర్హులుగా చేసింది. లబ్ధిదారులందరికీ 48 గంటల లోపే రూ.876లు తమ బ్యాంకు ఖాతాల్లో జమ కావడం తో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ పి జి కనెక్షన్ ఉన్న బియ్యం కార్డులందరూ ఈ పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పొందేలా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను టోల్ ఫ్రీ నెంబర్ 1967, పీజీఆర్ఎస్‌ల ద్వారా వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను ఎప్పటికప్పుడు జిల్లా అధికార యంత్రాంగం పరిష్కరిస్తూ ముందుకు సాగుతోంది.

ద్వారకాతిరుమలకు చెందిన అందుగుల చంద్రమ్మ మాట్లాడుతూ బడుగు జీవితాలకు దీపం 2 పథకం ఎంతో ఆసరానిచ్చిందన్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చిన 48 గంటల్లో అకౌంట్ లో 876 రూపాయలు జమ అయినట్లు సెల్ ఫోన్ కు మెసేజ్‌ వచ్చిందన్నారు. ద్వారకాతిరుమల కు చెందిన పొడుగుల పాప మాట్లాడుతూ దీపం-2 పధకం తమలాంటి మధ్యతరగతి కుటుంబాలకు వరం లాంటిదన్నారు. గృహిణిలైన తాము సిలిండర్ బుక్ చేసిన 48 గంటల్లో మా ఖాతాలో డబ్బులు జమవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏలూరుకు చెందిన సయ్యద్ సైదాని మాట్లాడుతూ దీపం-2 పథకం తమలాంటి పేదలకు ఎంతో ఆసరాగా ఉందన్నారు. అయితే నేరుగా ఉచితంగా ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సిలిండర్ డెలివరీ సమయంలో డబ్బులు చెల్లించకుండా సిలిండరు ఉచితంగా అందిస్తే మరింత ఊరటనిస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed