Gudivada Amarnath:అమర్ బినామీల లేఅవుట్‌పై కొరడా!

by Jakkula Mamatha |
Gudivada Amarnath:అమర్ బినామీల లేఅవుట్‌పై కొరడా!
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం:మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ బినామీలు తాను ప్రాతినిధ్యం వహించిన అనకాపల్లి నియోజకవర్గం పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వేసిన భారీ లే‌అవుట్‌కు చుక్కెదురైంది. కశింకోట మండలం విస్సన్నపేటలో గుట్టలను కబ్జా చేసి రెరా, వీఎంఆర్డీఏ అనుమతులు లేకుండా అప్పటి వైసీపీ ప్రభుత్వ పెద్దల మద్దతుతో వేసిన లే అవుట్ లో వ్యాపార కార్యకలాపాలు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. విశాఖ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ సోమవారం ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి అమర్నాథ్ అనుచరుడు ప్రసాద్ బృందం వేసిన ప్లాట్ల విక్రయాలపై మూర్తి యాదవ్ చేసిన ఫిర్యాదుపై అధికారుల బృందాన్ని లే‌అవుట్‌కు పంపి విచారణ చేయించిన కమిషనర్ వారి నివేదిక ఆధారంగా ఆదేశాలు జారీ చేశారు.

ప్లాట్ల విక్రయాలు ఆపండి..

విస్సన్నపేటలో అక్రమ లేఅవుట్‍లో ప్లాట్ల విక్రయాలను వెంటనే ఆపేయాలని, వైశాఖి వ్యాలీ పేరుతో ప్లాట్ల వ్యాపారం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ వారంలోగా సమాధానం ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. మహా విశాఖ నగర అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందున లేఅవుట్ పనులను, ప్లాట్ల విక్రయాలను నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఈ అక్రమ లే అవుట్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రలో భాగంగా సందర్శించి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ కూడా దీనిపై చర్యలుంటాయని స్నష్టం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story