కోట్లు వుంటేనే టికెట్లు..డబ్బు లేకపోతే వైకాపా ను తట్టుకోలేం?

by Jakkula Mamatha |
కోట్లు వుంటేనే టికెట్లు..డబ్బు లేకపోతే వైకాపా ను తట్టుకోలేం?
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: జనసేన అధినేత గత ఎన్నికల సమయంలో అదేపనిగా ప్రవచించిన జీరో బడ్జెట్ రాజకీయాలకు ఆ పార్టీ స్వస్తి పలికింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కోట్లు ఖర్చు చేయకపోతే జనం ఓట్లు వేయరని కఠోర వాస్తవాన్ని జనసేన ఎట్టకేలకూ గుర్తించింది. పొత్తులో భాగంగా గణనీయమైన సీట్లతో గట్టిగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్న జనసేన ఇప్పుడు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఆర్థికంగా కాస్త పటిష్టంగా వున్న వారికి సీట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతుంది. మొహమాటంతో ఉద్యమకారులకు, సామాజిక వేత్తలకు సీట్లు ఇచ్చిన డబ్బు ఖర్చు చేయకపోతే ఉపయోగం వుండదనే భావనకు ఆ పార్టీ వచ్చింది.

నగదు సిద్ధం చేసుకుని సీట్లు అడగండి?

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఆశిస్తున్న నేతలు అందుకు సరిపడా నగదు సిద్ధం చేసుకొని సీటుకోరాలనే మెసేజ్ ను జనసేన అధిష్టానం ఇప్పటికే పంపించింది. ఇప్పుడు ఎవరైనా సీటు కావాలని అడుగుతుంటే నిర్మోహమాటంగా మీరు ఎంత ఖర్చు చేయగలుగుతారు? అని అధిష్టానం ఎదురు ప్రశ్న వేసింది. నియోజకవర్గాన్ని బట్టి ఖర్చు వుంటుందని దానికి తగ్గట్టుగా అభ్యర్థులు సిద్ధం కావాలని స్పష్టం చేస్తుంది.

పార్టీ నుంచి ఇచ్చేదేమీ ఉండదు..

జనసేన పార్టీ నుంచి ఒక్క పైసా కూడా అభ్యర్థులకు ఇచ్చే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ యాత్రలు చేసినప్పుడు బయట నుంచి చందాలు తీసుకోకుండా సంబంధిత జిల్లాల నేతలే ఆ ఖర్చు భరించారు. పార్టీ లో నిధుల నిల్వ లేకపోవడం వల్ల ఇటీవల విశాఖ జిల్లా నేతలతో జరిగిన సమావేశం సందర్భంగా పవన్ తన వంతుగా పార్టీకి పది కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ నిధులు కేవలం పార్టీ నిర్వహణకే వినియోగిస్తారు.

నా సేన ..నా వంతు..

అనే నినాదంతో కార్యకర్తల నుంచి పార్టీ నిర్వహణ కోసం జనసేన చందాలు తీసుకుంటుంది. మిగిలిన పార్టీల మాదిరిగా రహస్యంగా గాక బహిరంగంగానే చందాలు వసూలు చేస్తుంది. ఆన్ లైన్ లో స్కాన్ కోడ్ ద్వారా పది రూపాయల నుంచి చందాలు ఇవ్వవచ్చు. కొన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల అద్దెలను కూడా పార్టీ నే చెల్లిస్తుంది.

చందాలిచ్చాం.. టికెట్ మాదే అన్నా కుదరదు?

టికెట్ ఆశించి జనసేనలో చేరి స్వచ్చందంగా చందాలిచ్చి అధిష్టానం ప్రమేయం లేకుండా టికెట్ తమదే అని ప్రచారం చేసుకునే వారి పట్ల కూడా పార్టీ కఠినంగానే వుంది. అటువంటి వారిని ఇటీవల గుర్తించి వారిచ్చిన చందాలను వెనక్కి ఇచ్చేసింది. తమదే టికెట్ అంటూ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకొంటున్న వారిపైన ఓ కన్ను వేసి వారితో మీడియాలో ఖండనలు ఇప్పిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed