AP Politics: ఆ పార్టీ అభ్యర్థికి కలిసి వస్తున్న వైసీపీ నిర్లిప్తత..?

by Disha Web Desk 18 |
AP Politics: ఆ పార్టీ అభ్యర్థికి కలిసి వస్తున్న వైసీపీ నిర్లిప్తత..?
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: అరకు పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత రోజు రోజుకూ బలపడుతున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా అరకు నుంచి గెలిచిన ఆమె ఇప్పుడు బీజేపీ తరపున బరిలోకి దిగి పాత పరిచయాలతో పావులు కదుపుతూ ప్రచారంలో మిగిలిన వారి కంటే స్పీడ్‌గా వున్నారు. బీజేపీతో పాటు మిత్రపక్షాలకు అన్ని నియోజక వర్గాల తోనూ బలమైన క్యాడర్ ఉండటం ఆమెకు కలసి వస్తుంది.

కనిపించని తనూజా రాణి

వైసీపీ టికెట్ పొందిన అరకు శాసనసభ్యుడు శెట్టి ఫల్గుణ కోడలు తనూజ రాణి ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు. ఫల్గుణ మీద వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయనకు వైసీపీ టికెట్ నిరాకరించి కోడలికి ఇచ్చింది. అయితే, ఆయనపై ఉన్న వ్యతిరేకత ఆమెపైనా వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థి కొత్త కావడం అరకుతో పాటు మిగిలిన ఆరు అసెంబ్లీలలో తిరగాల్సి రావడం కూడా సమస్య గానే వుంది. అసెంబ్లీ అభ్యర్దులతో సమన్వయం చేసుకుని పర్యటనలు చేయాల్సి వస్తోంది.

వైసీపీ ని వెంటాడుతున్న అసమ్మతి

బహిర్గతం కాని అసమ్మతి వైసీపీని వెంటాడుతోంది. గత ఎన్నికల్లో 52 శాతం ఓట్లతో రెండు లక్షలకు పైగా మెజారిటీతో గెలిచిన అరకు ఎంపీ గొట్టేడి మాధవికి అకారణంగా సీటు నిరాకరించారు. తొలుత అరకు అసెంబ్లీకి ఎంపిక చేసి కారణం లేకుండా ఏ సీటు లేకుండా చేయడం పట్ల ఆమె వర్గీయులతో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాడేరు శాసనసభ్యురాలు కె. భాగ్యలక్ష్మికి చివరి నిమిషంలో టికెట్ నిరాకరించడం నిరాశకు గురిచేసింది. పాడేరు టికెట్ పై ఆశ పెట్టుకున్న మాజీ మంత్రి పసుపులేటి బాలరాజుకు గానీ, ఆయన కుమార్తెకు గానీ టికెట్ దక్కపోవడం అసంతృప్తికి కారణమైంది.

సీపీఎం ఎవరి ఓటు చీల్చనుందో?

అరకు పార్లమెంట్ నుంచి సీపీఎం తరపున పాచిపెంట అప్పలనర్స పోటీ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజన ఉద్యమాలతో సీపీఎం బలంగానే వుంది. అయితే, ఆ బలం పార్టీని గెలిపించలేదని, ఓట్లు చీల్చడం ద్వారా ప్రత్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేయగలదని భావిస్తున్నారు. ఏ మాత్రం చెప్పుకోదగ్గ విధంగా త్రిముఖ పోటీ జరిగినా అది బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకే అనుకూలం అవుతుందనే అంచనా వేస్తున్నారు.

Next Story

Most Viewed