పీఏసీఎస్ చైర్మన్ పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే?

by Jakkula Mamatha |
పీఏసీఎస్ చైర్మన్ పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే?
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: తన పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసి తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సొంత పార్టీ నేతలను రాజీకి పిలచి చోడవరం శాసనసభ్యుడు కరణం ధర్మశ్రీ చేయి చేసుకున్న సంఘటన ఉమ్మడి విశాఖ జిల్లాలో సంచలనంగా మారింది. చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం వైకాపా నేతలు గేదెల సత్యనారాయణ, దొండ సన్యాసి రావు, కొల్లిమర్ల అచ్చెయ్యనాయుడు, వీర్ల సురేష్ , దేవత అప్పారావు తదితరులు శాసనసభ్యుడి పై తిరుగుబాటు చేశారు. అధిష్టానానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇటువంటి సంఘటనలు పార్టీ కి నష్టమనే అభిప్రాయంతో ఆదివారం విశాఖ డెయిరీకార్యాయలంలో రాజీ సమావేశం నిర్వహించారు.

విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం మంత్రి గుడివాడ అమర్నాధ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, విశాఖ డెయిరీ చైర్మన్, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి అడారి అనంద్ తదితరులు మధ్యవర్తిత్వం వహించి సమావేశం లో పాల్గొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న శాసనసభ్యుడు కరణం ధర్మశ్రీ పార్టీలోని తన ప్రత్యర్ధులపై ఆ సమావేశంలో ఒక్కసారిగా రాయలేని బూతులతో విరుచుకుపడ్డారు. ప్రత్యర్థి వర్గం కూడా ధీటుగా సమాధానం ఇవ్వడంతో వడ్డాది పీఏసీఎస్ చైర్మన్ సన్యాసిరావు పై చేయి చేసుకున్నారు. అలాగే ధర్మశ్రీ ముఖ్య అనుచరుడైన బుచ్చయ్యపేట జడ్ పీ టీసీ దొండ రాంబాబు అసమ్మతి వర్గానికి చెందిన ఎంపీటీసీ దేవర అప్పారావు ను కొట్టారు. దీంతో రాజీ సమావేశం గందరగోళం మధ్య అర్ధంతరంగా ముగిసింది. ధర్మశ్రీ పై నేరుగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు ఫిర్యాదు చేస్తామంటూ అసమ్మతి నేతలు ఆగ్రహం తో , అవమానం తో అక్కడి నుంచి నిష్క్రమించారు.

Advertisement

Next Story

Most Viewed