AP News:విశాఖలో మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్”

by Jakkula Mamatha |
AP News:విశాఖలో మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్”
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:విశాఖలో పర్యటిస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండో రోజు ఉదయం టీడీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో “ప్రజాదర్బార్” నిర్వహించారు. మంత్రి లోకేష్‌ను స్వయంగా కలిసి ప్రజలు తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ నర్స్ స్ట్రగుల్ కమిటీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ విధానంలో డీఎంఈ, ఏపీవీవీపీ, డీపీహెచ్, ఎన్‌హెచ్ఎం విభాగాలలో పనిచేస్తున్న నర్సులను రెగ్యూలర్ చేయాలని, వంద శాతం గ్రాస్ జీతం అమలు చేయాలని, పరస్పర అంగీకార బదిలీలు అమలు చేయాలని, బీమా అందించాలని కోరారు. జర్నలిస్టులకు 4 సెంట్లు చొప్పున ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు రూ.10వేల పెన్షన్ సదుపాయం, కరోనాతో మృతి చెందిన వారికి పరిహారం తదితర సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

అనకాపల్లి మండలం కోడూరులో ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో తమ తండ్రికి కేటాయించిన 5.22 ఎకరాల భూమిని వైసీపీ అండతో ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని ఎస్. నాగమణి, జి. జయలక్ష్మి కోరారు. డీఎస్సీ 2008 నోటిఫికేషన్‌లో ఎంపికై నష్టపోయిన అభ్యర్థులకు తగిన న్యాయం చేయాలని ఏపీ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. రష్యాలో వైద్య విద్య అభ్యసిస్తున్న తమ పిల్లలకు ఎన్టీఆర్ విదేశీ విద్య దీవెన బీసీ ఓవరిసీస్ స్కాలర్షిప్ మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటిందనే నెపంతో గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు కోరారు.

ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, గత వైసీపీ ప్రభుత్వంలో దళితుల హత్యలు, దాడుల పై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ సుధాకర్ అంశం, వైకాపా ఎమ్మెల్సీ అనంత బాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం, కోడికత్తి శ్రీను, కిరణ్ కుమార్ హత్య వంటి కేసులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. భర్త చనిపోయిన తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయడంతో పాటు జీవనోపాధి కల్పించాలని విశాఖకు చెందిన గంటిపిల్లి నూకరత్నం విజ్ఞప్తి చేశారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న నేతలు, కార్యకర్తలను కలిశారు. వారితో కలిసి ఫొటోలు దిగారు.

Advertisement

Next Story

Most Viewed