CM Jagan బ్రాండ్ ఇమేజ్ చూసే ఏపీకి పెట్టుబడులు

by srinivas |
CM Jagan బ్రాండ్ ఇమేజ్ చూసే ఏపీకి పెట్టుబడులు
X

దిశ, ఉత్తరాంధ్ర: సీఎం జగన్ బ్రాండ్ ఇమేజ్ చూసే పెట్టుబడులు వచ్చాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదిక వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను అంబానీ, అదాని, జిందాల్, ఒబెరాయ్, జిఎంఆర్, కృష్ణ ఎల్లా, భజంగా వంటి ప్రముఖులు పాజిటివ్‌గా చెప్పడం తెలుగు ప్రజలంతా చూశారన్నారు. కరోనా సమయాన్ని కూడా తట్టుకొని, నిర్ణీత సమయం కన్నా ముందే ఏ పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏ విధంగా చొరవ తీసుకుందో పారిశ్రామికవేత్తలు చెప్పిన మాటలు కూడా కళ్ళు ఉండి చూడలేని, నోరు ఉండి మాట్లాడలేని వారికి ఏం చెబుతామని మంత్రి అమర్‌నాథ్ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని పారిశ్రామికవేత్తలు నమ్ముతున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని సహజ వనరులను, వర్క్ ఫోర్స్‌ని చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తరలివచ్చారని ఆయన చెప్పారు.


14 సెక్టర్లలో పెట్టుబడులు వస్తాయని ఆశించామని, అవి 20 వరకు పెరగటం తమకు మరింత ఆనందంగా ఉందని మంత్రి అమర్‌నాథ్ చెప్పారు. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి ఘనతగా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం వచ్చిన ఈ పెట్టుబడులలో కనీసం 90 శాతం గ్రౌండ్ అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. ఒక్కో పరిశ్రమకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి, పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా చూడాలని సీఎం గట్టిగా చెప్పారని ఆయన అన్నారు. పెద్ద ఎత్తున పారిశ్రామిక సదస్సు విజయవంతంగా జరుగుతున్నా.. కొంతమంది దీనిపై విమర్శలు చేయడం శోచనీయమని మంత్రి అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed