- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ అభ్యర్థుల జాబితా విడుదల..బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే?
దిశ ప్రతినిధి, విశాఖపట్నం:ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు పార్లమెంట్ సీట్లుండగా, రెండింటి నుంచి బీజేపీ పోటీకి దిగుతుంది. పొత్తులో భాగంగా జిల్లాలో వున్న విశాఖ పార్లమెంటును వదిలేసి అనకాపల్లి, అరకు ఎస్టీ రిజర్వుడ్ స్థానం నుంచి బీజేపీ బరిలోకి దిగుతుంది. గతంలో విశాఖ పార్లమెంట్ నుంచి 2014 లో బీజేపీ ఒక పర్యాయం విజయం సాధించినప్పటికీ 2019లో తెలుగుదేశం ఐదు వేల ఓట్లతో ఓటమి చెందినందున ఆ పార్టీకే ఆ సీటు వదిలేశారు. అనకాపల్లి, అరకు లోక్ సభ స్ధానాలలో ఇంతకముందెప్పుడూ బీజేపీ విజయం సాధించలేదు.
అనకాపల్లి అనుకూలం
అనకాపల్లి నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బరిలోకి దిగుతున్నారు. కడప జిల్లాకు చెందిన ఆయన సామాజిక సమీకరణలు బేరీజు వేసుకొని అనకాపల్లిని ఎంచుకొన్నారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆయన కొప్పుల వెలమలు ఎక్కువగా వుండే అనకాపల్లి నుంచి మొదటి సారి పోటీ చేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని నర్సీపట్నం, మాడుగుల, పెందుర్తి స్ధానాలకు ఎక్కువగా వెలమలే ప్రాతినిధ్యం వహిస్తుంటారు. ఇప్పుడు కూటమిలో భాగంగా మాడుగుల, నర్సీపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ వెలమలనే బరిలోకి దింపింది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనకాపల్లి బలమైన స్ధానమే కావడం,జనసేన కారణంగా నియోజక వర్గంలో వెలమలకు ధీటుగా వున్న కాపు ఓట్లు బదిలీ కానుండడం వంటివి రమేష్ కు సానుకూలాంశం. మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, చింతకాయల అయ్యన్న పాత్రుడు కూటమి అసెంబ్లీ అభ్యర్ధులుగా బరిలో ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీలో నాలుగు స్థానాలకు టీడీపీ,మూడింటికి జనసేన పోటీ చేస్తున్నాయి.
అరకు కొరుకుడు పడేనా?
2014లో వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా అరకు పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన కొత్తపల్లి గీత ఆ పర్యాయం బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. 2019లో జగ జాగృతి పార్టీ స్థాపించి విశాఖ లోక్ సభ కు పోటీపడి 1150 ఓట్లు మాత్రమే తెచ్చుకున్న ఆమె పార్టీని బీజేపీలో విలీనం చేసి టికెట్ పొందారు. గిరిజన ప్రాంతాలు ఇప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండటం ఇప్పుడు గీతకు ఇబ్బందికరంగా మారింది. కమలం గుర్తు కూడా వారికి పెద్దగా తెలియకపోవడం మరో మైనస్. గిరిజన ప్రాంతాలలో బలహీనంగా ఉన్న పాలకొండ, పోలవరం స్థానాలను జనసేనకు, పాడేరును బీజేపీకి ఇచ్చారు. రెండు అసెంబ్లీల పరిధిలో ఒక ఓటు గ్లాస్ కు, మరో ఓటు కమలానికి గిరిజనులు వేయాలి.ఒక చోట రెండు ఓట్లు కమలానికి, మరో నాలుగు నియోజక వర్గాలలో అసెంబ్లీ ఓటు సైకిల్ కి, లోక్ సభ ఓటు కమలానికి వేయాలి.పెద్దగా చదువు రాని గిరిజనులు ఆ రకంగా పార్టీ గుర్తులను గుర్తించి ఎంత మేర వేస్తారన్నది ప్రశ్నార్ధకమే. సీట్లు ఆశించి భంగపడిన తెలుగుదేశం నేతల నుంచి సహకారం కూడా పెద్ద సమస్య గానే మారనుంది.