సీఎం జగన్ కు లేఖ.. వారసత్వ సంపదను కాపాడండి!

by Jakkula Mamatha |
సీఎం జగన్ కు లేఖ.. వారసత్వ సంపదను కాపాడండి!
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం:తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు పురాతన వారసత్వ వనరులను కాపాడుకుంటూ వస్తున్నారు. కొన్ని సైట్లను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.కానీ ఆంధ్రాలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దత్తత చేయడం బాధాకరమైన విషయమని ఫోరం ఫర్ బెటర్ విశాఖ ఆక్షేపించింది. ఫోరం కన్వీనర్, కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ కార్యదర్శి ఇఎఎస్ శర్మ ఆ మేరకు గురువారం జగన్మోహన్ రెడ్డి కి లేఖ రాశారు. హర్యానా ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో ఉన్న "అగ్రోహా" పురాతన సైటును ఏఎస్ఐ వారి పర్యవేక్షణలో, రాడార్ టెక్నాలజీ సహాయంతో, త్రవ్వకాల అవసరం లేకుండా, తక్కువ ఖర్చుతో అన్వేషణ చేపట్టిందని పేర్కొన్నారు.

విశాఖ నగర పరిసరాల్లో, తొట్లకొండ, బావికొండ, బొజ్జన్నకొండ వంటి అతి పురాతన బౌద్ధ అవశేషాలు వేలాది ఎకరాల్లో ఉండడం గుర్తించి నాలుగు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం చట్టప్రకారం నోటిఫై చేయడం జరిగిందని పేర్కొన్నారు. నిధుల కొరత వలన, రాష్ట్ర పురావస్తు శాఖ కొన్ని వందల ఎకరాల్లో మాత్రమే అన్వేషణ జరిపి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న కొన్ని అవశేషాలను మాత్రమే ప్రజల దృష్టికి తీసుకు వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖకు కావలసిన నిధులు, ఆధునిక సాంకేతిక సౌకర్యాలు కలిగించి ఉంటే ఆ శాఖ నిపుణులు, అన్ని బౌద్ధ వారసత్వ ప్రదేశాలను, పూర్తిగా అన్వేషించగలిగేవారని స్పష్టం చేశారు.

గత నలభై సంవత్సరాలలో విశాఖ నగరం చుట్టుపక్కల భూముల ధరలు పెరగడం కారణంగా, నోటిఫై చేయబడిన భూముల మీద రియల్ ఎస్టేట్ వ్యాపారుల దృష్టి పడటం, వారి ఒత్తిడికి లొంగి ప్రభుత్వం, ఆ ప్రదేశాలను డీనోటిఫై చేయడం, విశాఖ ప్రజల దురదృష్టం గా మారిందని ఆయన పేర్కొన్నారు. తొట్లకొండ, బావికొండ, బొజ్జన్న కొండ వంటి పురాతన బౌద్ధ ప్రదేశాలకు, విశాఖ ప్రాంతానికి చెందిన చరిత్రలో అత్యంత మైన ప్రాముఖ్యత ఉందని వీటిని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. అటువంటి ప్రదేశాలను రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతికి ఇస్తే, విశాఖ ప్రజల వారసత్వ వనరులకు ఎనలేని నష్టం జరుగుతుందని అవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా మీ ప్రభుత్వం శ్రీకాకుళం నుంచి అమరావతి వరకు ఉన్న పురాతన బౌద్ధ అవశేషాల ప్రాముఖ్యతను గుర్తించి, ఆ ప్రదేశాలను ASI పర్యవేక్షణలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, అన్వేషణ చేపట్టాలని, ఆ సైట్లను "బుద్ధిస్ట్ కారిడార్ గా" అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం తగిన ప్రణాళిక రూపొందించి యునెస్కో వంటి సంస్థల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed