ఫస్ట్ టైమ్ పాజిటివ్ ట్వీట్.. పవన్‌పై ప్రశంసల వర్షం

by srinivas |
ఫస్ట్ టైమ్ పాజిటివ్ ట్వీట్..  పవన్‌పై ప్రశంసల వర్షం
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఒక పవర్ స్టార్‌గా జనసేన పార్టీ అధినేతగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా సుపరిచితం. పవన్ కల్యాణ్ సినిమాల్లో చాలా దూకుడుగా నటిస్తూ ఉంటారు. అదే పవన్ కల్యాణ్ రాజకీయ రంగంలోనూ అంతే దూకుడు ప్రదర్శించేవాడు. అంతేకాదు బహిరంగ సభలు, సమావేశాల్లో పవన్ చేసే వ్యాఖ్యలు, ఆవేశపూరిత మాటలు విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇప్పటం గ్రామంలో ఇల్లు కూల్చివేతకు సంబంధించి బాధితుల పక్షాన నిలబడేందుకు టాప్‌పై ఎక్కి మరీ వెళ్లారు. ఈ సీన్‌‌ను ఏకంగా జాతీయ మీడియా సైతం తప్పుబట్టిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాన్ తీరుపై ఇప్పటికీ పలు విమర్శలు ఉన్నాయి. ఇంకా మారాలంటూ పలువురు సెటైర్లు వేస్తుంటారు.

అయితే విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ -2023పై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రాజకీయాలకు అతీతంగా పవన్ సమ్మిట్‌ను ఆహ్వానించడం పలువురు ప్రశంసిస్తున్నారు. వారెవ్వా అంటూ కితాబిస్తున్నారు. పవన్ కల్యా్ణ్ రాజకీయంగా పరిణితి చెందారని ఇప్పుడు అసలైన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

మా మద్దతు మీకే

కాగా వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023. విశాఖలోని ఏయూ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి పలువురు బిజినెస్‌మ్యాన్‌లు తరలివచ్చారు. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై జనసేనాని పవన్ కల్యాణ్ కీలక ట్వీట్ చేశారు. విశాఖకు వచ్చిన పెట్టుబడులదారులందరికీ జనసేన పార్టీ తరఫున స్వాగతం పలికారు. అంతేకాదు పెట్టుబడిదారులు మన ప్రతిభావంతులైన ఆంధ్రా యువతను ఆకట్టుకుంటారని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏపీకి అదృష్టాన్ని, మన యువతకు ఉద్యోగాలను, ప్రతి పెట్టుబడిదారునికి డబ్బు, విలువను తీసుకురావాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఈ సమ్మిట్ విజయవంతం అయ్యేందుకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పుకొచ్చారు. తాము చాలా కాలం నుంచి ఇలాంటి సమ్మిట్‌లు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కానీ బెటర్ లేట్ దేన్ నెవర్! అని పవన్ కల్యాణ్ సర్ధుకు పోయారు.

వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ యెుక్క ఆర్థిక వృద్ధి సామర్థ్యాన్ని ఈ సమ్మిట్ ప్రభావితం చేస్తుందని పవన్ తెలిపారు. రిచ్ ఖనిజ వనరులు, తీర ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు సహకరించాలని కోరారు. పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించాలని సూచించారు. కాంట్రాక్టుల కోసం రివర్స్ టెండరింగ్ లేదా కమిషన్‌లు వంటి అవాంతరాలు కల్పించొద్దని వైసీపీకి సలహా ఇచ్చారు. మరోవైపు సమ్మిట్‌ను విశాఖపట్నానికే పరిమితం చేయవద్దు అని సూచించారు. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు మొదలైన ప్రాంతాల్లో ఉన్న అవకాశాల గురించి పెట్టుబడిదారులకు తెలియజేయాలని విన్నవించారు. ఈ సమ్మిట్‌ను కేవలం ఒక విశాఖకే పరిమితం చేయకుండా రాష్ట్రం మొత్తానికి పెట్టుబడిదారుల సమ్మిట్ చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఒక ప్రతిష్టాత్మకమైన సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ రాబోయే రెండు రోజులు ప్రభుత్వంపై ఎలాంటి దాడి చేయదని చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు సైతం చేయమని హామీ ఇచ్చారు. ఈ సమ్మిట్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ఇండస్ట్రీలిస్ట్స్‌కు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Next Story