తెలుగు వారు మాతృభాషాను త్యాగం చేయడం బాధాకరం

by Jakkula Mamatha |
తెలుగు వారు మాతృభాషాను త్యాగం చేయడం బాధాకరం
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని "తెలుగుదండు" సంస్థ తెలుగు తల్లికి నీరాజనం వేడుకలు నిర్వహించారు. బుధవారం విశాఖ మద్దిలపాలెం కూడలి లోని తెలుగు తల్లి విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, భాషాభిమానులు పాల్గొని తెలుగు తల్లికి పుష్పాభిషేకం చేశారు. కార్యక్రమంలో వండర్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొని పద్యధారణ అలరించారు.

కార్యక్రమంలో తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మాతృభాషా అభిమానులందరూ ఫిబ్రవరి 21 ని ప్రపంచ మాతృభాషా వర్ధిల్లాలని పండుగ నిర్వహించుకుంటారు. ఈ సంప్రదాయం యునెస్కో వారి నిర్ణయం మేరకు 2000 సంవత్సరం నుంచి జరుగుతోందని చెప్పారు. 1956లో తూర్పు పాకిస్తాన్ గా ఉన్న బంగ్లాదేశ్ లో అధికార భాషగా ఉర్దూను రుద్దితే.. బెంగాలీ వారు మాతృభాష కోసం పోరాటం చేశారని, ఆ పోరాటంలో కొందరు యువకులు ప్రాణత్యాగం చేశారని, ఆ వీరుల స్మృతిగా , నివాళిగా నేడు కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు.

ప్రపంచమంతా మాతృభాషలను కాపాడుకోవడం కోసం ప్రాణాలను త్యాగం చేస్తుంటే తెలుగువారు మాత్రం రాజకీయ నాయకుల స్వార్థం కోసం అమ్మ భాషను త్యాగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్ల భాషకు మనం వ్యతిరేకం కాదని, అమ్మ భాషను మింగేసే పెత్తనం అన్యభాషకు ఇవ్వకూడదని, మన బిడ్డలు ఎన్ని భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన వాటికి పునాది మాతృభాష కావాలని, మన చరిత్ర, మన సంస్కృతి, మన పెద్దల నడక, మన మట్టి మూలాలు మాతృభాషలోనే ఉన్నాయని, మన చిన్నారులకు మాతృభాషను దూరం చేయవద్దని..తల్లిదండ్రులను వేడుకొన్నారు. ఇప్పటికైనా మన పాలకులు కళ్లు తెరిచి, వారి మూర్ఖపు చర్య లకు స్వస్తి చెప్పి తెలుగు భాషను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో పుర ప్రముఖులు ఏవియార్ మూర్తి, రాజమన్నార్, ఆడారి కిశోర్ కుమార్, ఆచార్య ప్రసాద్, జనజాగరణ వాసు, హేమా, గజల్ గాయని మళ్ళా జ్యోతిర్మయి, పంతుల లలిత, ఉండవల్లి సుజాత, సాహితీవేత్తలు శేఖర్ మంత్రి ప్రభాకర్, చిన సూర్యనారాయణ, నాగుల శ్రీనివాస్, సత్యనారాయణ, కళాకారులు బాదంగీర్ సాయి, కవి దాసు, తెలుగుదండు సారథులు శ్రీధర్, తన్మయి శేఖర్, ఆచార్య సూరప్పడు తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed