‘కోర్టు తీర్పును గౌరవించరా?’.. బహిరంగంగా కబ్జాలేంటి?

by Jakkula Mamatha |   ( Updated:2024-09-12 15:40:48.0  )
‘కోర్టు తీర్పును గౌరవించరా?’.. బహిరంగంగా కబ్జాలేంటి?
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:తమ స్థలంలో పనులు చేసుకుంటుండగా గూండాలొచ్చి తమపై దాడి చేశారని, దౌర్జన్యంగా నెట్టేశారని ఓ ఎన్నారై జంట గురువారం కన్నీరుమున్నీరైంది. ఇది ఇండియానా.. పాకిస్తానా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తమకు జరిగిన అన్యాయం పై నగర పోలీస్ కమిషనర్‌తో పాటు ఏపీ హోంమంత్రి అనిత, విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరగకపోతే దేశాన్ని వదిలి కుటుంబమంతా ఇతర దేశాలకు పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో బాధితులు మీడియాతో మాట్లాడారు.

కోర్టు తీర్పును గౌరవించరా..?

వేపగుంట-సింహాచలం రోడ్డులో సింహపురి కాలనీ వద్ద ప్లాట్ నెంబర్ 27/28 లలో ఉడా అనుమతి పొందిన 1/2004 పేరిట 446 గజాల స్థలం ఉంది. ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తగా విషయం కోర్టుకు చేరింది. చివరకు ఆ స్థలం చిరికి వెంకట పద్మజ, నాయుడు దంపతులకే చెందుతుందని విశాఖ కోర్టు పర్మినెంట్ ఇంజెక్షన్ ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో నాయుడు తండ్రి కొన్నాళ్లుగా ఆ స్థలంలో పనులు చేయించుకుంటుండగా డీవీ మహేష్, అనుచరులు అడ్డుపడుతూ వస్తున్నారన్నది ఆరోపణ. దీంతో అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిన నాయుడు, వెంకట పద్మజ దంపతులు హుటాహుటిన విశాఖ వచ్చేశారు.

గురువారం ఉదయం కూడా ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. తమపై కొంతమంది దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ బాధితులు నేరుగా పోలీస్ కమిషనర్‌ను సంప్రదించారు. ఆయన వెంటనే పెందుర్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కబ్జాదారులు పరారయ్యారు. తమకు న్యాయం జరగకపోతే చావే గతి అంటూ బాధితులు సంఘటన స్థలంలో చోటు చేసుకున్న దృశ్యాలను నగర పోలీస్ కమిషనర్ బగ్బీ, ఏపీ హోంమంత్రి అనిత, విద్యాశాఖ మంత్రి లోకేష్‌కి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. గోశాల వద్ద మైత్రీనగర్ లే అవుట్ వద్ద చోటు చేసుకున్న ఈ సంఘటన విశాఖ నగరంలో సంచలనం రేకెత్తించింది. తాము అనుమానం వ్యక్తం చేసే వ్యక్తుల పై చర్యలు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కబ్జాదారులు పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. అవసరమైతే పిడిఎఫ్ కూడా ప్రయోగిస్తామని హెచ్చరించారు. విశాఖ పోలీస్ కమిషనర్ రేట్లు ఇటువంటి సంఘటనలు జరిగితే క్షమించేదే లేదని హెచ్చరించారు.

Advertisement

Next Story