ఆ నియోజకవర్గంలో చీరలే చీరలు.. వద్దన్నా వచ్చి పడుతున్న చీరలు

by Jakkula Mamatha |
ఆ నియోజకవర్గంలో చీరలే చీరలు.. వద్దన్నా వచ్చి పడుతున్న చీరలు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఏటా వచ్చే మహిళా దినోత్సవం వేరు ఎన్నికల ఏడాది మహిళా దినోత్సవం వేరు. ఎప్పుడు అంతగా గుర్తుకు రాని ఆడపడుచులు ఆ ఏడాది నాయకులు అదే పనిగా గుర్తుకు వచ్చేస్తున్నారు. అక్క, చెల్లి, వదిన, అమ్మ అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ అడగకుండానే చీరలు కానుకగా ఇచ్చేస్తున్నారు. ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి గాక ఏటా వస్తే తమకు చీరలు కొనుక్కునే అవసరమే వుండదని మహిళలు ముచ్చటపడిపోతున్నారు.రానున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకొని వివిధ పార్టీల నేతలు పోటీ పడి మరీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే అకేషన్ ను వెతుక్కుంటూ చీరలు పంచేస్తుండడం మహిళామణులను ఆనందింపజేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత చీరలు, బహుమతులు ఇస్తే ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధం అనే కారణంగా తెలివైన నేతలు ముందుగానే చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేశారు. టికెట్లు ఖరారైన వారు ధైర్యంగా ఆ పని చేస్తుండగా, ఖరారు కాని వారు కూడా నాలుగు ఓట్లు కలసిరాకపోతాయా అనుకొంటూ పంచేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ తో పాటు పలు నగరాలలో ఎన్నికల సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీకి దిగుతున్న ప్రస్తుత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తన ఫోటోతో పేరుతో అంటూ ప్రింట్ చేసిన కవర్లో పెట్టి సచివాలయ సిబ్బంది, డ్యాక్రా సిబ్బంది, వాలంటీర్ల సాయంతో బహిరంగంగానే పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గ మంతటా మహిళల ఓటర్ కార్డు ఆధారంగా ఆ పంపిణీ జరుగుతుంది. ఇక విశాఖ దక్షిణ నియోజకవర్గం టికెట్ ను ఆశిస్తున్న బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ గతంలో పంపిణీ చేసి ఆపేసిన చీరల పంపిణీ ఎన్నికలను దృష్టిలో వుంచుకొని తిరిగి ప్రారంభించారు. నగరంలోని 35 వ వార్డులో గురువారమే 1500 మందికి చీరలు పంపిణీ చేసినట్లు ఆయన ఏకంగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. పలు చోట్ల ఆ రకంగా చీరల పంపిణీ జరుగుతున్నాయి. ఎన్నికల సీజన్ కావడంతో నేతలంతా మర్చిపోకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం, ఏర్పాటైన కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డితో పాటు ముఖ్య నేతలందరికీ ఆ పార్టీ మహిళా నాయకులు పేడాడ రమణకుమారి ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో భారీ సన్మానాలు జరగడం గమనార్హం. మార్చి ఎనిమిదో తేదీన గతంలో లేనంతగా నేతలు ఇటు శివరాత్రి అటు మహిళా దినోత్సవ కార్యక్రమాలలో బిజీ బిజీగా గడిపారు.

Advertisement

Next Story