AP News:‘అమరావతి రుణాలకు షరతులు వర్తిస్తాయి’..సీఎం చంద్రబాబుకు ఈఏఎస్ శర్మ లేఖ

by Jakkula Mamatha |
AP News:‘అమరావతి రుణాలకు షరతులు వర్తిస్తాయి’..సీఎం చంద్రబాబుకు ఈఏఎస్ శర్మ లేఖ
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:అమరావతి అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన రూ.15 వేల కోట్ల నిధులు చేజారిపోకుండా అప్రమత్తంగా ఉండాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రానికి రూ.15,000 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందిస్తామని కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. నిధుల వినియోగానికి పలు షరతులు ఉంటాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ప్రపంచ బ్యాంకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌‌లో భారతదేశం తరఫున గవర్నర్‌గా ఉన్న అనుభవం ఆధారంగా ఈ క్రింద సూచించిన విషయాలపై దృష్టి సారించాలని ఆయన గురువారం సీఎంకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

ముందస్తు హామీలు తీసుకోవాలి..

ముఖ్యంగా ఈ నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ముందస్తు హామీలు తీసుకోవాలని శర్మ సూచించారు. ప్రపంచ బ్యాంకు ఇతర సంస్థల కన్సార్టియం రాష్ట్రానికి ఇచ్చే నిధులను రాష్ట్రానికి ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులకు అదనంగా కేంద్రం విడుదల చేయాలని, ప్రపంచ బ్యాంకు ఇతర సంస్థల నుంచి వచ్చే నిధులు డాలర్ల రూపంలో ఉంటున్న కారణంగా ఎక్స్చేంజ్ భారం పడకుండా చూడాలని సూచించారు. ఇవ్వవలసిన గ్రాంట్ వాటా మీద ముందస్తు హామీ తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు ఇచ్చే రుణాలు పర్యావరణ దృష్ట్యా షరతులతో ముడిపడివుంటాయి కాబట్టి ఆ ఉల్లంఘనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అమరావతి ప్రణాళిక మీద జాతీయ హరిత ట్రిబ్యునల్ ఓఏ నెం.171/2017 లో 2017 కేసులో ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంత వరకు అమలు చేసిందన్న దానిపై ప్రపంచ బ్యాంకు వారు ప్రశ్నించే అవకాశం ఉందని వాటిని పరిగణనలోకి తీసుకోవాలని శర్మ గుర్తు చేశారు.

Advertisement

Next Story