తల్లిలాంటి పార్టీకి రాజీనామా చేయడం బాధ కలిగించింది: Venkaiah Naidu

by Seetharam |   ( Updated:2022-09-09 13:21:33.0  )
తల్లిలాంటి పార్టీకి రాజీనామా చేయడం బాధ కలిగించింది: Venkaiah Naidu
X

దిశ, ఏపీ బ్యూరో : తల్లి ప్రేమను పొందలేకపోయిన నన్ను బీజేపీయే పెంచి పోషించింది. అలాంటి పార్టీకి రాజీనామా చేయడం చాలా బాధ కలిగించింది. ఉప రాష్ట్రపతిగా ఎంపికైన రోజే రాజకీయాలకు స్వస్తి పలికాను. ఇటీవల పదవీ విరమణ చేసిన తర్వాతనే తిరిగి స్వతంత్రుడినయ్యాను అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని రాజానగరం జీఎస్ఎల్‌ మెడికల్‌ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు నేతలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఘనంగా సన్మానించారు.

దేశానికి వెంకయ్య నాయుడు అందించిన సేవలను కొనియాడారు. ఉపరాష్ట్రపతి పీఠం అధిరోహించి తెలుగు ప్రజల కీర్తిని దేశానికి చాటిచెప్పారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. తనకు 15 నెలల వయసు ఉన్నప్పుడే తల్లి చనిపోయిందని అప్పటి నుంచి తన అమ్మమ్మే పెంచిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీనే సర్వస్వమైందని.. పార్టీ అన్ని విధాలుగా తనను ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకువచ్చిందని వెంకయ్య నాయుడు సభలో చెప్పుకొచ్చారు.

త్వరలోనే అందరినీ కలుస్తా

ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ పొందిన తర్వాత ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నానని వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ వేడుక ద్వారా పాత మిత్రులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ ఆత్మీయ సమావేశంలో చిరకాల మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, పురప్రముఖులను కలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది అని అన్నారు. మిత్రులు కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు అభినందనీయం అంటూ వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.

ఉప రాష్ట్రపతి పదవీ విరమణ చేశాకే తిరిగి స్వతంత్రుడినయ్యానని త్వరలోనే జిల్లాల వారీగా పాత మిత్రులను కలుసుకుంటానని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. చిన్నతనం నుంచి ప్రజల మధ్య ఉండటం అలవాటుగా మారిందని ఇకపై ప్రజల్లోనే ఉంటానని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. అనంతరం దేశంలోనే తొలిసారిగా జీఎస్ఎల్‌ వైద్య కళాశాలలో నెలకొల్పిన బయోటిక్‌ స్కిల్‌ ల్యాబ్‌ను వెంకయ్య నాయుడు ప్రారంభించారు.

Also Read: ఈనెల 22న కుప్పంకు సీఎం జగన్

Advertisement

Next Story