Ap News: సజ్జల భార్గవ్‌పై వంగలపూడి అనిత ఫిర్యాదు

by srinivas |
Ap News: సజ్జల భార్గవ్‌పై వంగలపూడి అనిత ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను సజ్జల భార్గవ్ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆరోపించారు. సజ్జల భార్గవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు వంగలపూడి అనిత ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ భార్గవ్ తన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబును గద్దె దింపాలని, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని తాను అనలేదని అయినప్పటికీ తన వ్యాఖ్యలను ఎడిట్ చేసి దుష్ప్రచారం చేశారని ఆరోపించారు.

మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం

మహిళా దినోత్సవం రోజు వైఎస్ జగన్ సొంత ఛానెల్‌లో కూడా ప్రచారం చేశారని వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చిత్తూరు జిల్లాలో లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో తాను మాట్లాడిన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేశారని అనిత ఆరోపించారు. ఈ దుష్ప్రచారంపై పాయకరావుపేట పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మార్ఫింగ్‌లు చేసి వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని వంగలపూడి అనిత మండిపడ్డారు.

ఫిర్యాదును పట్టించుకోవడంలేదు

ప్రభుత్వాన్ని ఎవరైనా నిలదీస్తే వారిపై కేసులు పెడుతున్నారని.. తమపై ఇష్టనుసారంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే ఫిర్యాదు మాత్రం తీసుకోరంటూ వంగలపూడి అనిత మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ పీఎస్ పెట్టారని, అసలు దిశ చట్టం ఉందా అని ఆమె నిలదీశారు. వైఎస్ జగన్‌కు పరదాలు కప్పడానికేనా పోలీసు వ్యవస్థ ఉందని వంగలపూడి అనిత ఆరోపించారు.

Advertisement

Next Story