నేను, కుమారస్వామి స్టీల్ ప్లాంట్‌కు వెళ్తున్నాం: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ

by srinivas |
నేను, కుమారస్వామి స్టీల్ ప్లాంట్‌కు వెళ్తున్నాం: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
X

దిశ, వెబ్ డెస్క్: తాను, కేంద్రమంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్‌కు వెళ్తున్నానమని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ(Union Minister Bhupathiraju Srinivasa Varma) స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌(Visakha Steel Plant)కు కేంద్ర ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy)తో కలిసి ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను గురువారం సందర్శించనున్నారు.

వర్మ మాట్లాడుతూ..

ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత మొదటిసారి అక్కడికి వెళ్లి కార్మిక, ఉద్యోగ సంఘాలతో చర్చించబోతున్నామన్నారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రభుత్వ పెద్దలను ఒప్పించి, నచ్చజెప్పి ప్యాకేజ్ తీసుకొచ్చామని తెలిపారు. ప్యాకేజ్ ద్వారా ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ప్లాంట్ యాజమాన్యం, కార్మికులు ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరుతున్నానని చెప్పారు. ఉద్యమించి ప్లాంట్ సాధించుకున్నట్టే... సమష్టిగా పని చేసి సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. 2030 నాటికి దేశంలో స్టీల్ ఉత్పత్తిని 300 మిలియన్ టన్నులకు పెంచాలన్నది ప్రధాని ఆలోచన అని చెప్పారు. ఇప్పటికే బొకారో స్టీల్ ప్లాంట్ సందర్శించి, అక్కడ స్టీల్ ఉత్పత్తి పెంచాలని సూచించడం జరిగిందన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల 3 నెలల వేతన బకాయిలు చెల్లించే అంశంపైనా గురువారం జరిగే భేటీలో చర్చిస్తామన్నారు. కార్మికుల్లో అపోహలు వద్దన్నారు. భవిష్యత్తులో ప్రైవేటీకరణ చేస్తారన్న ఆందోళన చెందకండి అని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సూచించారు.

అందరిపై స్టీల్ ప్లాంట్‌ పరిరక్షణ బాధ్యత

స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మపేర్కొన్నారు. ఈ మేరకు సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లే దిశగా అందరూ కష్టపడాలని ఆయన సూచించారు. ప్యాకేజ్ డిమాండ్ చేసిన కొన్ని సంస్థలు, వ్యక్తులు ప్యాకేజ్ ఇచిన తర్వాత వారు చేస్తున్న ప్రకటనలు పూర్తి బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నారు. సంస్థకు రూ 35 వేల కోట్లు బకాయిలు, రుణాలు ఉన్నాయని వెల్లడించారు. సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు మొత్తం సొమ్ము కేంద్రం భరిస్తేనే బయటపడుతుందని చెప్పడం సరికాదన్నారు. కేంద్రం తన వంతుగా రూ. 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు సంస్థలో 3 బ్లాస్ట్ ఫర్నేస్ లను పని చేయించేలా చేసి, ఉత్పత్తి సామర్థ్యాన్ని గరిష్ఠానికి తీసుకెళ్లి సంస్థను లాభాల బాట పట్టించాల్సిన అవసరం, బాధ్యత యాజమాన్యం, కార్మికులపై ఉందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.

Next Story

Most Viewed