175 కాదు.. 225.. ఏపీలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు?

by srinivas |
175 కాదు.. 225.. ఏపీలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు?
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో శాసనసభ స్థానాల పెంపు 2026లోనేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానం తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026లో జనాభా లెక్కల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225 శాసనసభ స్థానాలకు, తెలంగాణలో 119 నుంచి 153 శాసనసభ స్థానాలకు పెంచనున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడే ఎస్సీ, ఎస్టీ స్థానాల పునఃసర్దుబాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం -2014ను న్యాయమంత్రిత్వ శాఖ ద్వారా మార్చి 1, 2014న గెజిట్‌లో ప్రచురించినట్లు వివరించింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌‌లో టీడీపీ అధికారంలో ఉండగా కేంద్రంలో టీడీపీ మద్దతుతో ఎన్డీఏ అధికారంలో ఉంది. దీంతో 2026 పునర్విభజన వైసీపీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపవచ్చని 2006 పరిణామాలను గమనించిన కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వివాదాల మయమైన 2006 పునర్విభజనలో జరిగిన పునర్విభజన ప్రక్రియ 2008లో అమలు చేయబడింది. దీనికి అప్పట్లో వివిధ రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. 2006లో జరిగిన పునర్విభజన ప్రక్రియపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేసింది.

అప్పటి కాంగ్రెస్ పార్టీకి పునర్విభజన ప్రక్రియ అనుకూలంగా ఉందని ఆరోపించింది. కాంగ్రెస్‌కు అనుకూలమైన ప్రాంతాలను ఒకే నియోజక వర్గంలో కలపడం, టీడీపీ అనుకూల నియోజకవర్గాలలోని గ్రామాలని పక్క నియోజక వర్గాల్లో కలపడం వంటివి చేసి టీడీపీని దెబ్బతీసే విధంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరిగినట్టు అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు ఎన్డీయేని, పునర్విభజన కమిషన్‌ని ప్రభావితం చేసి పులివెందులను ఎస్సీ నియోజకవర్గంగా మార్చవచ్చని కొందరు వైసీపీ నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పెంపు, ప్రస్తుత నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభజన, ఎస్సీ నియోజకవర్గాల గుర్తింపు ఇవన్నీ కలిసి, వైఎస్సార్సీపీ భవిష్యత్ ఎన్నికల అవకాశాలను దెబ్బతీసే విధంగా పరిణామాలు ఉంటాయా? అనే ఆందోళన వైసీపీలో వ్యక్తమవుతోంది.

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంటే ఏమిటి?

భారతదేశంలో తాజా జనాభా లెక్కల ఆధారంగా అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్విభజించేందుకు ఈ పునర్విభజన కమిషన్లు ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియలో భాగంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను గుర్తించడం, రొటేట్ చేయడం కూడా ఉంటుంది. ఒకే నియోజకవర్గం శాశ్వతంగా ఎస్సీ లేక ఎస్టీ రిజర్వు అవ్వకుండా ఉండేందుకు రొటేషన్ పద్ధతిలో రిజర్వ్‌డ్ నియోజక వర్గాలని మారుస్తూ ఉంటారు. రాష్ట్రపతిచే ఏర్పాటు చేయబడిన పునర్విభజన కమిషన్, ఎన్నికల కమిషన్‌తో కలిసి పనిచేస్తుంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. కమిషన్ తీసుకునే నిర్ణయాలను సవాలు చేసే వీలు ఉండదు. వివాదాలమయం అయిన 2006 పునర్విభజన 2008లో అమలు చేయబడింది.

Read more...

నేడు తిరుపతికి చంద్రబాబు.. నాలుగు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు



Advertisement

Next Story

Most Viewed