తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ టికెట్ల కోటా క్లోజ్

by srinivas |
తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ టికెట్ల కోటా క్లోజ్
X

దిశ, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశికి సంబంధించిన 4.23 లక్షల దర్శనం టోకెన్లను నాలుగు రోజుల్లోనే భక్తులు సొంతం చేసుకున్నారు. వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనానికి ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు స్లాట్ చేసిన సర్వ దర్శనం టోకెన్ల జారీ సోమవారం నాటికి పూర్తయింది. వైకుంఠ ఏకాదశి దర్శనానికి సంబంధించి ముందుగా 2.25 లక్షల రూ.300 టికెట్లను ఆన్ లైన్ ద్వారా భక్తులకు టీటీడీ గత నెలలోనే కేటాయించడం జరిగింది. ఇది కాకుండా ఈనెల 23న వైకుంఠ ఏకాదశి నుంచి జనవరి 1వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు టీటీడీ అందుబాటులో ఉంచింది. దీనికి సంబంధించిన 4.23 లక్షల టోకెన్లను ఆఫ్ లైన్‌లో తిరుపతి కేంద్రంగా 10 కేంద్రాల్లో 90 కౌంటర్ల ద్వారా, సర్వదర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేసింది. ఈ నెల 22 నుంచి జారీ చేసిన వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్లు సోమవారం నాటికి పూర్తిగా భక్తులకు జారీ చేయడంతో కోటా పూర్తయింది. స్లాట్ ప్రకారం ఏ రోజు, ఏ తేదీలో, ఏ సమయంలో దర్శనానికి వెళ్లాలనే సమాచారం టోకెన్లలో ముద్రించటం ద్వారా భక్తులు సులువుగా శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. జనవరి 2 నుంచి స్వామి వారి సాధారణ సర్వ దర్శనం కోసం టోకెన్ల జారీ ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. టోకెన్లు లేకుండా శ్రీవారి దర్శనానికి అర్హులు కాదని భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.


ద్వాదశి రోజున రూ.5.05 కోట్ల ఆదాయం

ఇదిలా ఉండగా మొదటి రోజు శనివారం వైకుంఠ ఏకాదశి రోజున 67,906 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ. 2.50 కోట్లు ఆదాయం వచ్చింది. రెండవ రోజు ద్వాదశి రోజున భక్తులు సంఖ్య తగ్గినప్పటికీ రికార్డ్ స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం పెరగడం విశేషం. ఆదివారం ఒక్కరోజే 63,519 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 26,424 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అదే సమయంలో భక్తులు తమ కానుకలను హుండీ ద్వారా సమర్పించు కోవడంతో స్వామికి రూ.5.05 కోట్లు ఆదాయం వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed