నందికొట్కూరులో త్రిముఖ పోరు.. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి ఎమ్మెల్యే ఆర్థర్

by Shiva |   ( Updated:2024-03-26 02:45:21.0  )
నందికొట్కూరులో త్రిముఖ పోరు.. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి ఎమ్మెల్యే ఆర్థర్
X

దిశ ప్రతినిధి, కర్నూలు : రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే నందికొట్కూరు సెగ్మెంట్‌లో ఈ సారి త్రిముఖ పోటీ ఉండనుందా?, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ లో చేరడం టీడీపీకి ప్లస్‌గా మారిందా.., కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే ఆర్థర్ బరిలో నిలవనున్నారా? కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం రెండ్రోజుల్లో ప్రకటన చేయనుందా?, ఈ సారి వైసీపీ ఓట్లు చీలనున్నాయా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. నందికొట్కూరు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ల మధ్యే పోటీ ఉండనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బరిలో నిలవడంతో వైసీపీ చీలే అవకాశాలు లేకపోలేదు. ఈ చీలిక టీడీపీకి కలిసి రానుందనే ప్రచారం జోరందుకుంది. అయితే పొత్తు ప్రభావం టీడీపీపై పడే అవకాశం ఉందా? అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

నంద్యాల పార్లమెంట్ పరిధిలోని నందికొట్కూరు నియోజకవర్గంలో ఈ సారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండనుంది. ఎస్సీ రిజర్వుడు స్థానమైన ఈ సెగ్మెంట్ లో దాదాపు 2,16,559 మంది ఓటర్లున్నారు. అందులో పురుష ఓటర్లు1,06,125 మంది ఉండగా మహిళా ఓటర్లు 1,10,417 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 17 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 4,292 మంది అధికంగా ఉన్నారు. ఎస్సీ రిజర్వ్‌గా ప్రకటించిన తర్వాత 2009లో జరిగిన ఎన్ని్కల్లో మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చిమ్మె బిచ్చెన్న, ప్రజారాజ్యం అభ్యర్థి రేణుకమ్మపై 11,968 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

2014లో వైసీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఐజయ్య ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి లబ్బి వెంకటస్వామిపై 21,814 ఓట్లతో గెలుపొందారు. 2019లో వైసీపీ అభ్యర్థి విశ్రాంత ఐపీఎస్ అధికారి తోగూరు ఆర్థర్ టీడీపీ అభ్యర్థి బండి జయరాజుపై 40,610 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కు టికెట్ రాకుండా చేశాయి. దీంతో టీడీపీ టికెట్ ఆశించినా ఫలితం లేకపోవడంతో ఎమ్మెల్యే ఆర్థర్ హస్తం గూటికి చేరారు. దీంతో ఈ సారి ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా గిత్త జయసూర్య, వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ ధారా సుధీర్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ లు పోటీలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్థర్ ను ఆ పార్టీ అధిష్టానం రెండ్రోజుల్లో ప్రకటించనుందని సమాచారం. దీంతో ఈ సెగ్మెంట్ లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.

లోకల్.. నాన్ లోకల్ రగడ

వైసీపీ అధినేత చేపట్టిన అభ్యర్థుల మార్పు చేర్పులు ఆయా నియోజకవర్గ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయనడంలో సందేహం లేదు. నందికొట్కూరు నియోజకవర్గంలో స్థానికులకు కాకుండా కడప జిల్లాకు చెందిన డాక్టర్ ధారా సుధీర్ కు వైసీపీ టికెట్ కేటాయించింది. ఇక టీడీపీ అభ్యర్థి గిత్త జయసూర్య, కాంగ్రెస్ అభ్యర్థి తోగూరు ఆర్థర్ లు ఇద్దరూ స్థానికులే. దీంతో అధికార వైసీపీ నేతలు, కార్యకర్తలు నాన్ లోకల్ కు చెందిన డాక్టర్ సుధీర్ కు ఎలా సపోర్టు చేయాలనే ఆలోచనలో పడ్డారు. ఈ విషయాన్ని నియోజకవర్గ నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఆ నాయకులు ఈ విషయాన్ని ప్రిస్టేజ్ గా తీసుకుని వైసీపీని గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించినట్లు సమాచారం.

టీడీపీకి ముస్లిం ఓటర్ల ప్రభావం

నందికొట్కూరులో 40 వేల మంది ముస్లిం ఓటర్లు్న్నారు. బీజేపీతో పొత్తు నేపథ్యంలో టీడీపీకి ముస్లిం ఓటర్ల ప్రభావం పడనుందా? అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ వ్యతిరేకత వైసీపీతో పాటు కాంగ్రెస్‌కు కలిసి రానుంది. ప్రధానంగా ముస్లింలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. అయితే టీడీపీ నేతలు మాత్రం క్షేత్ర స్థాయిలో తమకు అలాంటి ప్రభావం ఉండబోదని చెబుతున్నారు. ఒకవేళ ముస్లింల ప్రభావం ఉంటే మాత్రం వైసీపీకి విజయం సాధించినట్లేనని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందేహాలకు త్వరలోనే ఓటర్లు తెరదించనున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Read more..

‘ఆమంచి’ హవా ముగిసినట్లేనా? అంతులేని కథగా కృష్ణ‌మోహన్ రాజకీయం

Advertisement

Next Story

Most Viewed