Andhra Pradesh : ముంచినా తేల్చినా జగనే.. వైసీపీ శ్రేణుల్లో టెన్షన్

by Javid Pasha |
Andhra Pradesh : ముంచినా తేల్చినా జగనే.. వైసీపీ శ్రేణుల్లో టెన్షన్
X

వైసీపీ శ్రేణుల్లో నలుగుతున్న చర్చ ఒక్కటే. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసుల దాడితో ప్రయోజనమేంటి అనేదే ఆ చర్చ. ప్రభుత్వ తీరుతో లాభం కన్నా నష్టమే ఎక్కువన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. నిజంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రానున్న ఎన్నికల్లో పార్టీ జయాపజయాలకు సీఎం జగనే కారణం తప్ప ఎమ్మెల్యేలు, మంత్రులు కాదంటూ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ప్రజల్లో ఇంకా అసంతృప్తులు ఉన్నాయంటే సగటు ప్రజలపై పెరుగుతున్న భారాలతోపాటు నియంతృత్వ పోకడలే కారణమనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనిపై సీఎం జగన్​ పునరాలోచిస్తారా.. మొండిగా ఇలాగే ముందుకెళ్తారా అనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ అధికారానికి వచ్చిన వెంటనే అప్పటికే కొనసాగుతున్న అభివృద్ధి పనులను నిలిపివేశారు. సాగు, తాగు నీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులను రద్దు చేశారు. ఆ పనులను నిలిపేసి నిధులను వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేయలేదు. ఇది ప్రజల్లో అసంతృప్తి ప్రబలడానికి ఓ కారణంగా కనిపిస్తోంది. ఆపాటికే బడుగు బలహీన వర్గాల యువతకు ఆదరువుగా ఉన్న స్వయం ఉపాధి పథకాలను రద్దు చేయడం వాళ్లలో నిరాశా నిస్పృహలను నింపింది. ఆశించిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పెరగకపోవడం.. స్వయం ఉపాధికి గండిపడడం యువతలో ఆక్రోశానికి దారి తీసింది.

నవరత్నాలకే ప్రాధాన్యం..

సీఎం జగన్​ పాలనలో చేపట్టిన వినూత్న సంస్కరణలకు ప్రజల నుంచి మద్దతు లభించింది. ప్రత్యేకంగా సామాన్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే తిప్పలు లేకుండా వలంటీర్లు, సచివాలయాలను ప్రవేశపెట్టడాన్ని స్వాగతించారు. దళారులకు తావు లేకుండా పథకాలను నేరుగా లబ్దిదారులకు అందించడంలో ప్రభుత్వం ప్రజల మెప్పును పొందింది. అనేక రకాల సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లడాన్ని హర్షించారు. సంక్షేమ పథకాలన్నీ నగదు బదిలీ కింద మార్చడాన్ని కూడా జై కొట్టారు. నవరత్నాలే అన్ని సమస్యలకూ పరిష్కారమని భావించడం వల్లే ప్రజల్లో కొంత అసంతృప్తికి కారణమైంది.

బాదుడే బాదుడు..

గత ప్రభుత్వం ఐదేళ్లలో ఏటా సుమారు రూ. 50 వేల కోట్ల చొప్పున సంక్షేమానికి వెచ్చించింది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అంతకన్నా భారీ స్థాయిలో వెచ్చించింది ఏమీ లేదు. అయినా గత ప్రభుత్వం సుమారు రూ.3 లక్షల కోట్లు అప్పు చేస్తే వైసీపీ సర్కారు అంతకు రెండు రెట్లు ఎక్కువగా అప్పులు చేసింది. గత ప్రభుత్వం కన్నా తీవ్ర స్థాయిలో ప్రజలపై భారాలు మోపింది. పెట్రోలు, డీజిల్​, నిత్యావసరాలపై పన్నుల పోటు ఎక్కువైంది. కరెంటు చార్జీల గురించి చెప్పనవసరం లేదు. మద్యం ధరలు పెరిగాయి. ఆస్తి, ఇళ్ల పన్నులు పెరగడంతో ఇంటి అద్దెలు తడిసి మోపెడవుతున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాల ఆదాయాలు పెరగకపోగా జీవన వ్యయం భరింపశక్యం కాని దుస్థితికి చేరింది. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారిలో సైతం అసంతృప్తికి దారితీసింది.

జగన్​ స్వయంకృతాపరాధమే..

అవన్నీ ఒక ఎత్తయితే ప్రతిపక్షాలపై చౌకబారు విమర్శలు, సమస్యలపై రోడ్డెక్కితే పోలీసులను ఉసిగొల్పడం ప్రభుత్వ ప్రతిష్టను మరింతగా దిగజారుస్తోంది. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు దీటుగా సమాధానం చెప్పాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలి. దీనికి భిన్నంగా ప్రభుత్వం సహనం కోల్పోయి వ్యవహరించడాన్ని తటస్థులు, మధ్య తరగతి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతలపై కేసులు బనాయించడం, పోలీసులను ఉసిగొల్పడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం హుందాతనంగా వ్యవహరించాలని కోరుకునే ఈ వర్గాలకు ప్రభుత్వ చర్యలు రుచించడం లేదు. వీటన్నింటికీ కేంద్ర బిందువు సీఎం జగనే. కోట్ల మంది హృదయాలను గెల్చుకొని అధికారానికి వచ్చిన తర్వాత అదే ప్రజలకు దూరమైతే అది సీఎం జగన్​ స్వయంకృత అపరాధమే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed