టీడీపీ మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి

by Anjali |   ( Updated:2023-05-26 15:08:48.0  )
టీడీపీ మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోపై రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహిస్తున్నారు. అందుకు రాజమండ్రి వేదికయింది. గోదావరి ప్రజల మన్ననలు పొందితే అధికారం ఖాయమనే సెంటిమెంటుతో ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మహానాడులో ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదాను విడుదల చేసే అవకాశమున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. అది చంద్రబాబు చెబుతున్నట్లు సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను తగ్గించేట్లు ఉంటుందా? అత్యధిక ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుందా! అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలు పెంచే ప్రణాళికలు ఉంటాయా? అనే అంశాలపై అటు పార్టీ శ్రేణుల్లో.. ఇటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

అసమానతలతో.. సమాజంలో అశాంతి

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ‘రాష్ట్రానికి ఇదేం ఖర్మ’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఈసందర్భంగా అసమానతలు మరింతగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సమాజంలో అశాంతికి దారితీస్తుందని పేర్కొన్నారు. టీడీపీ అధికారానికి వస్తే అసమానతలను తగ్గించే లక్ష్యంతో పనిచేస్తుందని వెల్లడించారు. అసమానతలను తగ్గించడమనేది ఓ సుధీర్ఘ ప్రణాళికాబద్దంగా జరగాల్సిన కృషి. ఏ వర్గాలపై భారాలు మోపాలి.. ఏయే వర్గాలకు రాయితీలు ఇవ్వాలి.. ఇంకే వర్గాల సంక్షేమానికి ఎంత వెచ్చించాలనే అంశాలు ప్రధానంగా ఉంటాయి. వీటిని సమన్వయం చేసే దిశగా ప్రభుత్వాలు విధి విధానాలు అమలు చేయాలి. దీనికి తగ్గట్లు టీడీపీ మేనిఫెస్టో ఉంటుందా? అనే దానిపై రకరకాల విశ్లేషణలు ముందుకొస్తున్నాయి.

గతంలో 600కు పైగా హామీలు..

టీడీపీ 2014లో అధికారానికి రాకముందు సుమారు 600కు పైగా హామీలతో ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయలేక పోయిందనే అపవాదు ఉంది. దీనిపై విపక్షాలు ప్రశ్నిస్తాయని పార్టీ వెబ్‌ సైట్ నుంచి మేనిఫెస్టోను తొలగించినట్లు ఆరోపణలున్నాయి. ఈసారి రూపొందించే మేనిఫెస్టోను ప్రజలు ఏమేరకు విశ్వసిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ చంద్రబాబువి హైటెక్​ ఆలోచనలు అనే నానుడి ఉంది. పార్టీ కార్యాలయంలోనే సాఫ్ట్‌వేర్​ఉద్యోగాల కోసం శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అందువల్ల అట్టడుగు వర్గాలు, వాళ్లకు ఆధారమైన వ్యవసాయ, పారిశ్రామిక రంగాల గురించి చంద్రబాబు పట్టించుకుంటారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సాఫ్ట్‌వేర్ రంగంలో 90 శాతం.. ఆధిపత్య వర్గాలకే ఉపాధి

ఇప్పటికీ సాఫ్ట్‌‌వేర్​రంగంలో ఉపాధి 90 శాతం ఆధిపత్య వర్గాలకే పరిమితమైంది. కంపెనీలు, వాటి సీఈవోలు ఆయా వర్గాలకు చెందిన వాళ్లే ఉన్నారు. దీంతో మిగతా అట్టడుగు వర్గాలు దరిదాపులకు చేరే వాతావరణం లేదు. అయినా నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర యువతకు సాఫ్ట్‌వేర్ రంగం ప్రత్యామ్నాయ ఉపాధి చూపగలదా? అనేది మిలియన్​ డాలర్ల ప్రశ్న. రాష్ట్రంలో సుమారు కోటి మంది యువకులు ఉంటే.. అందులో 20 శాతం మాత్రమే సుస్థిర ఉపాధి పొందుతున్నారు. ఎక్కువ శాతం అసంఘటిత రంగంలో చాలీచాలని వేతనాలతో, నిత్యం అభద్రతా భావంతో కొలువులు నెట్టుకొస్తున్నారు. వీళ్లందరికీ మేనిఫెస్టో దిశా నిర్దేశం చేయగలదా? అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సగానికి పైగా వ్యవసాయంపైనే ఆధారం

నేటికీ రాష్ట్ర జనాభాలో సగానికిపైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. ఈ రంగంలో ఎన్నో సమస్యలున్నాయి. కౌలుదారీ చట్టంలో లొసుగులు, పంటల ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ దాకా, ప్రతికూల వాతావరణ సమస్యలు, పంటల బీమా క్లెయిముల సమస్యలున్నాయి. వీటన్నింటిలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించాలి. ప్రభుత్వ జోక్యం మరింతగా పెరగాలి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలి. గ్రామీణ యువతను ఇటువైపు మళ్లించే దిశగా ప్రభుత్వాలు కార్యాచరణ అమలు చేస్తే తప్ప పల్లెసీమలు ఆర్థిక పుష్టిని సాధించలేవు. దీనికి సంబంధించి మేనిఫెస్టోలో ఏం పెడతారనే దానిపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

Vemagiri: రేపే టీడీపీ మహానాడు.. చంద్రబాబు ప్రసంగంపైనే అందరి దృష్టి

ఏపీలో ఎడతెగని పొత్తుల పంచాయితీ!

Advertisement

Next Story

Most Viewed