- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మన జీవనాడి.. కడప జిల్లాలో ఎన్నో రకాల జంతువులు
జింకలు, చిరుతలు, ఎలుగు బంట్లు, దుప్పులు, కణుతులు, అడవి పందులు, ముళ్ళ పందులు, నక్కలు, తోడేళ్ళు, అలువలులాంటి వన్య ప్రాణులతోపాటు నెమళ్లు, అడవి కోళ్ళు, కలివికోళ్లు ఇవి చూస్తే చాలు మనసు కేరింతలు కొడుతుంది. కొండలు, పాయలు, కొండలపై నుంచి జాలువారే సెలయేళ్ల మధ్య కొద్దిసేపు సమయం గడిపితే చాలు.. ఆనంద లోకాల్లో తేలియాడినట్లుంటుంది. ఈ వన్య ప్రాణులను రక్షించుకునే బాధ్యత మనందరిపై ఉంది. నేడు వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
దిశ, కడప: జిల్లాలోని నల్లమల, లంకమల, శేషాచలం అడవులే ఆవాసాలుగా సంచరించే జంతువులకు రక్షణకు అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి ప్రజల నుంచీ సహకారం కోరుతోంది. మండువేసవిలో సైతం తాగునీటికి ఇబ్బందులు ఎదురుకాకుండా సాసర్ పాట్లు ద్వారా నీటి సౌకర్యం, అగ్నికీర్లకు అవి ఆహుతి కాకుండా ఫైర్ లైన్ లు ఏర్పాటు చేయడం లాంటి అనేక కార్యక్రమాలను అటవీ శాఖ చేపడుతోంది.ఉమ్మడి కడప జిల్లాలో 4.59 లక్షలు హెక్టార్లు అటవీ విస్తీర్ణం ఉంది. అందులో 3.15 లక్షల హెక్టార్లు ఎర్రచందనం. ఇక్కడ శేషాచలం, నలమల, లంకమల తదితర అటవీ ప్రాంతాలు ఉన్నాయి.
వన్య ప్రాణుల రక్షణ కోసం
వన్య ప్రాణులు రక్షణ చర్యల్లో భాగంగా జంతు ప్రేమికులతోపాటు మంచి నడవడిక వున్న వారిని అటవీశాఖ ఇన్ ఫార్మర్ గా నియమించుకుంది. వీరితోపాటు అటవీ ప్రాంత సమీప గ్రామాల్లో అటవీశాఖ నియమించుకున్న ఇన్ ఫార్మర్లకు, గ్రామ ప్రజలకు వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల పై అవగాహన కల్పిస్తోంది. అటవీశాఖకు సంబంధించి డీఎఫ్ వో, ఎఫ్ఆర్ వో, అటవీ సిబ్బందికి సంబంధించి ఫోన్ నంబర్లను గ్రామాల్లోని గోడలపై రాయించారు. ఎవరైనా వేటగాళ్లు దాడులు నిర్వహిస్తే ఇన్ ఫార్మర్ల ద్వారా వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తున్నారు. రిజర్వు ఫారెస్ట్ లో బావులు, నీటి కుంటలు, చెలమల్లో పూడికలు తీయడం, వాటర్ సోర్స్ అభివృద్ధి చేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. వన్యప్రాణుల రోడ్డు దాటే ప్రాంతాల్లో ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే అటవీ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. వన్యప్రాణల సంరక్షణ కోసం కళాజాత ద్వారా ప్రదర్శనలు ఇప్పించి ప్రజలను చైతన్య పరుస్తున్నారు.
ఆరోగ్య రక్షణ కోసం
వన్య ప్రాణులకు తాగు నీరు దొరక్కపోతే రాళ్లు నాకడం, చెట్ల కొమ్మలు, బెరడు నాకడం ద్వారా నోటికి ముళ్లు గుచ్చుకుంటాయి. నాలుక, నోటి భాగాలు చీలి గాయపడుతూ అనారోగ్యానికి గురవుతుంటాయి. వీటి నివారణ కోసం ఉప్పుగడ్డలు ఏర్పాటు చేశారు. ఒక్కో ఫారెస్ట్ రేంజ్ పరిధిలో కేజీ బరువున్న 500 నుండి 1000 ఉప్పు గడ్డలు ఏర్పాటు చేస్తారు. మంచినీటి కోసం ఒక్కో ట్యాంకర్ నీటిని 4, 5 సాసర్ పిట్స్ లలో నింపుతారు. ప్రతి రేంజ్ పరిధిలో 50 నుండి 60 సాసర్ పిట్స్ ఉంటాయి. నెలలో 3,4 సార్లు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొస్తారు.
అగ్ని ప్రమాదాలకు గురి కాకుండా..
వన్యప్రాణులు అగ్నిప్రమాదాల బారిన పడకుండా నేషనల్ బయోడెవర్స్ స్కీం, కంపా, రెడ్ శ్యాండిల్ ప్రొటెక్షన్ పథకం నిధుల ద్వారా పైర్ లైన్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క రేంజ్ పరిధిలో 150 నుంచి 200 కిలోమీటర్లు ఈ ఫైర్ లైన్స్ ఉంటాయి.
వన్య ప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం: డీఎఫ్ వో
అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అడవులకు నిప్పు పెట్టడం వలన వృక్షజాతి, జంతు జాతి నశించిపోతుంది. వన్యప్రాణుల రక్షణకు కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఎవరైనా కావాలని నిప్పు పెడితే మూడేళ్లు జైలు శిక్ష లేదా లక్ష రూపాయలు జరిమానా లేదా రెండు విధిస్తారు. అడవిలో నిప్పునకు సంబంధించిన సమాచారం తెలిస్తే 9000 660708 నంబర్ ను సంప్రదించాలి.