Minister Kollu Ravindra:‘గత ప్రభుత్వం అభివృద్ధిని ప్రశ్నార్ధకంగా మార్చింది’

by Jakkula Mamatha |
Minister Kollu Ravindra:‘గత ప్రభుత్వం అభివృద్ధిని ప్రశ్నార్ధకంగా మార్చింది’
X

దిశ, ఏపీ బ్యూరో: మచిలీపట్నం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి, ప్రతి ఊరికి చక్కని రోడ్డు, ప్రతి వీధిలో శుభ్రమైన మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు చేసి తీరుతామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని బీచ్ రోడ్ ఆధునికీకరణ, పొట్లపాలెం రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు రూ.4500 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 23న నిర్వహించిన గ్రామ సభల్లో వచ్చిన వినతులను పరిష్కరించేలా సోమవారం కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రతి నియోజకవర్గానికి రూ.20 కోట్ల వరకు నిధులు కేటాయించారని, వారం రోజుల పాటు పల్లె పండుగ కార్యక్రమం ద్వారా పనులకు శంకుస్థాపన నిర్వహించి సంక్రాంతి లోగా పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నామని పేర్కొన్నారు.

ఇప్పటికే మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలో రూ.20 కోట్ల విలువైన రోడ్లు, డ్రైన్లు, గోకులాల పనులను గుర్తించామని, మరో రూ.10 కోట్ల నిధులు రప్పించుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో చిన్న పని కూడా చేయకపోగా మట్టి ఎత్తుకుపోయారని విమర్శించారు. ఆ పనులను మళ్ళీ మేము పున:ప్రారంభించామని, బీచ్ సుందరీకరణలో భాగంగా రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా నాలుగు అడుగుల మేర ప్రహరీ, పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. మంగినపూడి బీచ్ సమీపంలో రిసార్టులు, హోటళ్ల నిర్మాణాలకు 80 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించామని తద్వారా ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని ఆయన అన్నారు. నియోజకవర్గంలో సుమారు 300 వరకు పనులు చేపట్టామని, ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు, ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయిలు, పరిశుభ్రమైన డ్రైన్ లక్ష్యంగా అడుగులేస్తున్నామన్నారు. టూరిజం, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ వ్యవస్థల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Next Story