- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ప్రలోభాల పర్వం ప్రారంభం
ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకొనేందుకు వైసీపీ, టీడీపీ, పీడీఎఫ్, స్వతంత్ర్య అభ్యర్థులు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టుకొని రాయలసీమ ప్రాంతానికి చెందిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టాలని ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. తమ పార్టీకి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని నిరూపించుకొనేందుకు అధికార వైసీపీ వ్యూహాలు రచించింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠగా సాగుతున్నాయి.
దిశ, కడప/అనంతపురం: కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. వైసీపీ తరఫున అనంతపురం జిల్లాకు చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి కుమారుడు రవీంద్రనాథ్ రెడ్డి, టీడీపీ తరఫున పులివెందులకు చెందిన భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పిడిఎఫ్ తరఫున పోతుల నాగరాజు బరిలో ఉన్నారు.
ఇండిపెండెంట్లుగా పట్టు పోగుల పవన్ కుమార్‌తో పాటు పలువురు పోటీలో నిలిచారు. పశ్చిమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మొదటిసారిగా వైఎస్ఆర్ సీపీ పోటీ చేస్తోంది. ఈ పార్టీ తరఫున కడపకు చెందిన విద్యా సంస్థల అధినేత ఎంవీ రామచంద్రారెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ మాత్రం పోటీ చేయకుండా లెఫ్ట్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తోంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలతోపాటు పీడీఎఫ్, ఎస్టీయూ, యూటీఎఫ్ మద్దతుతో తాజా ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పోటీ చేస్తున్నారు.
టీచర్ల సంఘాల మధ్య చీలిక ఎవరికి లాభం
పశ్చిమ రాయలసీమలో చాలా మంది పోటీ పడుతున్నప్పటికీ ప్రధానంగా నలుగురు అభ్యర్థుల మధ్య బహుముఖ పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డికి ఎస్టీయూ, యూటీఎఫ్ మద్దతు పలుకుతున్నా గతసారి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించిన హెడ్మాస్టర్స్ అసోసియేషన్ నుండి ఈ సారి జీవి నారాయణరెడ్డి పోటీలో నిలిచారు. గతంలో మద్దతు ఇచ్చిన స్కూల్ అసిస్టెంట్స్, పీఈటీ అసోసియేషన్లు మినహా ప్రభుత్వ టీచర్స్, ఎంఈవో, పండిత పరిషత్ సంఘాలు పీడీఎఫ్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీటీఎఫ్ తరఫున చలమల అనిల్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు.
ఇక అధికార పక్షం అభ్యర్థిగా ప్రైవేట్ స్కూళ్ల సంఘం ప్రతినిధి రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు 25 వేల ఓట్లు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లు చెరి సగం ఉన్నారు. ప్రైవేటు టీచర్లను ఆకట్టుకోవడంలో అధికార పక్షం ముందంజలో ఉంది. ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి అధికార పక్షానికి గట్టి పోటీదారుగా ఉన్నారు. గతంలో కత్తి నరసింహారెడ్డి పై పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఒంటేరు ఓడిపోయారు. ఈ స్థానంలో మొత్తం 12 మంది బరిలో ఉన్నారు.
తూర్పున ఉదయించేదెవరు ?
ఇక తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి త్రిముఖ పోటీ ఉంది. అధికార పక్షం అభ్యర్థిగా ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల యజమాని పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి, పీడీఎఫ్ తరఫున యూటీఎఫ్ కు చెందిన బాబు రెడ్డి, ఇండిపెండెంట్ గా ఎల్సీ రమణారెడ్డి బరిలో ఉన్నారు. ఈ స్థానంలో మొత్తం 8 మంది పోటీకి దిగారు.
ఓటుకు నోటు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆయా పార్టీల ఆధ్వర్యంలో వివిధ తాయిలాలతో మభ్యపెడుతున్నారు. ఓటుకు సుమారు రూ.5 వేల వరకు పంపిణీ చేస్తున్నారు.