‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి’.. విద్యార్థి యువజన సంఘాల డిమాండ్

by Jakkula Mamatha |
‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి’.. విద్యార్థి యువజన సంఘాల డిమాండ్
X

దిశ, కాకినాడ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని, ఉద్యోగుల బలవంతపు బదిలీలు తక్షణమే నిలుపుదల చేయాలని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. కాకినాడ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరాలను సీఐటీయు జిల్లా అధ్యక్షులు దువ్వ శేష బాబ్జి, సీహెచ్ రాజకుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, పెద్దిరెడ్డి సత్యనారాయణ దండలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై.బాబి, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం.గంగ సూరిబాబు, విద్యార్థి జేఏసీ బుల్లి రాజు, పిడిఎస్‌యు(వి) జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, డివైఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని, సొంత గనులు కేటాయించాలని, విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం చేయాలన్నారు. అలాగే రాష్ట్ర కూటమి ప్రభుత్వం లడ్డుపై కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకై పని చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ 32 మంది బలిదానాలతో ఏర్పడిందని, అలాంటి సంస్థను ప్రైవేటీకరణ చేయడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రైవేటీకరణ ఆపకుంటే ఉమ్మడి ప్రజా సంఘాల కార్యాచరణ సిద్ధం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed