AP News:సర్కార్‌కు ఊరట.. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

by GSrikanth |
AP News:సర్కార్‌కు ఊరట.. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆరు నెలల కాలవ్యవధి లోపల రాజధాని నిర్మాణం పూర్తి చేయాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు కాలపరిమితిలోగా నిర్మాణాలను పూర్తి చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులపై ధర్మాసనం స్టే విధించింది. దీంతో ప్రభుత్వానికి కాస్త ఊరట లభించినట్లైంది. హైకోర్టు ఏడు అంశాలపై తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే కేవలం ఐదు అంశాలపైనే సుప్రీంకోర్టు స్టే విధిందించింది. రాజధాని అమరావతిపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నంలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించగా..పిటీషనర్ల తరఫు న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు.

ప్రభుత్వం తరఫు వాదనలు

అమరావతి రాజధాని అంశంలో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆరు నెలల్లోగా రాజధానిని అభివృద్ధి చేయాలంటూ ఆదేశాలిచ్చింది. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు హైకోర్టు తీర్పును అమలు చేయాలని కోరుతూ అమరావతి రైతులు సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. సోమవారం ద్విసభ్య ధర్మాసనం వాదోపవాదనలు విన్నది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్, పిటీషనర్ల తరఫు న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒక నెలలో రాజధాని పనులు పూర్తిచేయాలని హైకోర్టు చెపుతోంది. రాజధానిపై నిరంతరంగా హైకోర్టు ఆదేశాలిస్తోంది. అమరావతిని రాజధానిగా తొలగించట్లేదని కేకే వేణుగోపాల్ వివరించారు. మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటని పేర్కొన్నారు. అయినా మూడు రాజధానుల బిల్లును సైతం ప్రభుత్వం ఉపసంహరించుకుంది అని గుర్తు చేశారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తోందని కోర్టుకు తెలియజేశారు. రాజధానిపై పూర్తి నిర్ణయం ప్రభుత్వానికే ఉందా లేక హైకోర్టు ఆదేశించినట్లుగా ప్రభుత్వాలకు పరిమిత అధికారాలు ఉన్నాయా? అని హైకోర్టును కోరారు. హైకోర్టు తనకు లేని అధికారాన్ని ప్రయోగిస్తున్నట్లు తాము భావిస్తున్నామని న్యాయవాది కేకే వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. అసాధ్యమైన పనులన్నీ చేయమని చెపుతోంది అని కోర్టు దృష్టికి న్యాయవాది కేకే వేణుగోపాల్ తీసుకెళ్లారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలి అని న్యాయవాది కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు.

ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

ఇరువాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. ఏ రాష్ట్రమైనా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం అని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా కాలపరిమితితో కూడిన పలు హైకోర్టు ఉత్తర్వులపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆరు నెలల్లోగా రాజధానిని అభివృద్ధి చేయడం సాధ్యమేనా? అని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఏమైనా టౌన్​ ప్లానరా? ఇలాంటి అంశాలలో నైపుణ్యం లేకుండా ఇలాంటి ఆదేశిలిస్తారా ? రెండు నెలలలో నిర్మాణం చేయమంటారా ? డ్రా చేయమంటరా...? అని ప్రశ్నించింది. కోర్టులు ఎప్పటికీ ప్రభుత్వాలు కాదు...అలాంటి ఆదేశాలు ఇవ్వొచ్చా? మీరే ప్రభుత్వమైతే, అక్కడ క్యాబినెట్ ఎందుకు ? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రభుత్వంలాగా వ్యవహరిస్తోందా ? అని న్యాయమూర్తి జస్టిస్​ నాగరత్న ప్రశ్నించారు. అంత ఒకే చోట కేంద్రీకరించడం ఎలా సాధ్యం అని అడిగారు. ఏ నగరాలను అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కదా అని ప్రశ్నించారు. హైకోర్టు ఈ అంశంలో తన పరిధిని అతిక్రమించింది అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది.

ఐదు అంశాలపైనే స్టే విధించిన సుప్రీంకోర్టు

అమరావతి రాజధాని కేసులో ఏడు అంశాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది కేకే వేణుగోపాల్ కోరారు. అయితే అందుకు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. పూర్తిస్థాయి స్టే విధించలేమని తెలిపింది. అయితే కాలపరిమితితో ముడిపడి ఉన్న చివరి ఐదు అంశాలపై స్టే విధించింది. ఏపీ సీఆర్డీఏ యాక్ట్‌ సెక్షన్‌ 58 ప్రకారం రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు ప్రాసెస్‌ తీర్పు వచ్చిన తేదీ నుంచి నెలరోజుల్లో పూర్తిచేయాలి....ఏపీ సీఆర్డీఏ యాక్ట్‌ సెక్షన్‌ 61 ప్రకారం టౌన్‌ మాస్టర్‌ ప్లానింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ కలిసి పూర్తి చేయాలి అన్న రెండు అంశాలపై స్టే విధించింది. అలాగే డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ కమ్‌ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఫామ్‌ 9.14 ప్రోవిజన్‌ -సీఆర్డీఏ యాక్ట్‌ 2015లోని నిబంధనల ప్రకారం 6 నెలల్లో అమరావతి కేపిటల్‌ సిటీ, కేపిటల్‌ రీజియన్‌ నిర్మాణం చేపట్టాలి అన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. వీటితోపాటు ప్రభుత్వం, సీఆర్డీఏలు సంయుక్తంగా రోడ్లు, తాగునీరు, ప్రతిప్లాట్‌కు విద్యుత్‌ కనెక్షన్‌, డ్రైనేజి సహా ఏర్పాటు చేసిన అమరావతి కేపిటల్‌ సిటీ నివాసయోగ్యంగా మార్చాలి అన్న అంశంపైనా సుప్రీంకోర్టు స్టే విధించింది. ఏపీ సీఆర్డీఏతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం భూములిచ్చిన రైతులకు ప్రామిస్‌ చేసినట్టుగా అమరావతి కేపిటల్‌ రీజియన్‌లో స్థలాలు 3 నెలల్లోగా కేటాయించాలి అన్న షరతులపైనా స్టే విధించింది. ఇదే సందర్భంలో రాష్ట్రప్రభుత్వం, సీఆర్‌డీఏలు అక్కడ జరుగుతున్న అభివృద్ధిపై ఎప్పటికప్పుడు వేర్వేరు అఫిడవిట్లు సమర్పించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

అయితే 'ఏపీ సీఆర్డీఏ 2015 లాండ్‌ పూలింగ్‌ షెడ్యూల్ 2 మరియు 3 నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ నిర్వర్తించాలి. థర్డ్‌ పార్టీ ప్రయోజనాలకు పూలింగ్‌ లాండ్‌ తనఖా పెట్టారాదు. రాజధాని నిర్మాణం, కేపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌కు తనఖా పెట్టవచ్చు అన్న షరతులపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు విముఖత వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

AP News: ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. స్టే

Advertisement

Next Story

Most Viewed